Dhirendra Shastri: రామాలయ ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో, కేంద్రం చేస్తున్న కార్యక్రమాలపై ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి శుక్రవారం స్పందించారు. ‘‘ఇది అతడి భయాన్ని తెలియజేస్తోందని, మేము మసీదులపై మందిరాలను నిర్మించడం లేదని, దేవాలయాలను పునర్నిర్మించాలని అనుకుంటున్నామని, అతడికి ఈ భయం ఉంటే, ఆ భయంతోనే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఓవైసీని ఉద్దేశిస్తూ అన్నారు.
ఇటీవల బాబ్రీ మసీదు గురించి ప్రస్తావిస్తూ.. గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదని, యువకులారా మనం, మన మసీదును కోల్పోయాము, మీకు బాధగా లేదా..? అని భవానీ నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ వ్యాఖ్యానించారు. మరో మూడు నాలుగు మసీదుల గురించి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ముస్లిం యువకులు అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Read Also: MLA MS Babu: ఎమ్మెల్యే యూటర్న్..! ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే..!
ఈ వ్యాఖ్యలపై మాట్లాడిని ధీరేంద్ర శాస్త్రీ.. శ్రీరాముడు రాజకీయ అంశం కాదని, దీన్ని రాజకీయ చేయడం మూర్ఖత్వం అని అన్నారు. రాజకీయాలు మతం ద్వారా నడుస్తాయి, రాజకీయాల ద్వారా మతం నడవదని, దేశ ప్రజలు మేల్కొనే ఉన్నారని, ప్రతీది చూడగలరని, జాతీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఓటేయండి, రాముడికి గౌరవం, ఐక్యత, శాంతి అనే సొంత విధానం ఉందని, దీన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామ మందిరాన్ని కులతత్వం కోసం నిర్మించడం లేదని, రామభక్తుల విశ్వాసం కోసం నిర్మిస్తున్నారని అన్నారు. రాముడు అందరికి చెందిన వాడు అని అన్నారు. మరో రెండు మసీదు వివాదాల గురించి స్పందించిన ధీరేంద్ర శాస్త్రీ..జ్ఞానవాపిలో శివుడు, కృష్ణజన్మభూమిలో శ్రీ కృష్ణుడు ఉన్నాడని అన్నారు. ఈ విషయాల్లో ఎవరి అభిప్రాయం అవసరం లేదని, చట్టం, భారత సుప్రీంకోర్టు ఉన్నాయని, అక్బర్, బాబర్ గతంలో మన దేవాలయాలపై దాడి చేశారని అన్నారు. దీపావళి పండగ కంటే ఈ కార్యక్రయం చాలా ప్రత్యేకమైందని అన్నారు.