Ireland Old Woman: ఐర్లాండ్‌లో 66ఏళ్ల వృద్ధురాలు కొన్ని కారణాల వల్ల కలత చెంది ఆత్మహత్య చేసుకోవటానికి చేసిన పని అక్కడి డాక్టర్లకు చెమటలు పట్టించింది. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ఏకంగా 55 బ్యాటరీలను మింగేసింది. దీంతో కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు వృద్ధురాలిని ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ మింగిన బ్యాటరీలలో AA, AAA బ్యాటరీలు ఉన్నాయి. తొలుత వైద్యులు మహిళ కడుపును ఎక్స్‌రే తీయగా ఇనుప వస్తువులు ఉన్నాయని గ్రహించారు. కొన్ని గంటల తర్వాత అవి బ్యాటరీలు అని నిర్ధారించుకున్నారు. మహిళ కడుపు నుంచి బ్యాటరీలు విసర్జన ద్వారా బయటకు వస్తాయని డాక్టర్లు భావించారు. దీంతో 5 రోజులు వృద్ధురాలిని హాస్పిటల్‌లోనే ఉంచారు. కానీ వారం రోజుల్లో ఆమె శరీరం నుండి కేవలం 5 బ్యాటరీలే బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు గంటల కొద్దీ శ్రమించి ఆపరేషన్ ద్వారా 46 బ్యాటరీలను బయటకు తీశారు.
Read Also:కొత్త జంటలు విడిపోవడానికి కారణాలు ఇవేనట..
పెద్ద పేగు, చిన్న పేగుల్లో ఇరుకున్న బ్యాటరీలను ఇతర వైద్య విధానాల ద్వారా డాక్టర్లు బయటకు తీశారు. అయితే ఒకేసారి ఇన్ని బ్యాటరీలు మింగిన సంఘటన ఇదేనని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా చిన్న సైజ్ బ్యాటరీలను చిన్నారులను మింగుతూ ఉంటారని.. కానీ ఉద్ధేశపూర్వకంగా ఇన్ని బ్యాటరీలను మింగడం అసాధారణ విషయమని వైద్యులు వాపోయారు. బ్యాటరీలను మింగడం చాలా హానికరం అని హెచ్చరించారు. బ్యాటరీలు గొంతులో చిక్కుకున్నట్లయితే లాలాజలం విద్యుత్ ప్రవాహాన్ని పుట్టిస్తుందన్నారు. ఇది అన్నవాహికను కాల్చి రసాయన ప్రతిచర్యను ప్రేరేపిస్తుందన్నారు. బ్యాటరీల నుంచి కెమికల్ లీకేజ్ కావడంతో పాటు GI ట్రాక్ట్ అడ్డంకి వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయని.. ఇలాంటి పనులకు ఎవరూ పాల్పడవద్దని హితవు పలికారు.