Doctors forgot to remove forceps from Kerala woman’s stomach: సిజేరియన్ ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ మహిళ కడుపులో కత్తెర మరిచారు. దీంతో గత ఐదేళ్లుగా కేరళకు చెందిన హర్షినా అనే మహిళ తీవ్ర నొప్పిని భరిస్తోంది. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా కూడా ఈ నొప్పి తగ్గలేదు. గత ఆరు నెలలుగా నొప్పి తగ్గేందుకు హర్షినాకు డాక్టర్లు పవర్ ఫుల్ యాంటీబయాటిక్స్ తో చికిత్స చేశారు అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే చెకప్ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా స్కానింగ్ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కడుపులో ఓ లోహ వస్తువు ఉన్నట్లు స్కానింగ్ లో బయటపడింది.
2017లో కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు హర్షినాకు సిజేరియన్ చేశారు. ఆ సమయంలో శస్త్రచికిత్సకు వాడే ‘‘ఫోర్సెప్స్’’ను కడుపులోనే మరిచారు. ఫోర్సెప్స్ అనేది శస్త్రచికిత్స సమయంలో రక్తనాళాలను బిగించేందుకు ఉపయోగించే కత్తెర లాంటి పరికరం. అయితే అప్పటి నుంచి సదరు మహిళ నొప్పితో బాధపడుతోంది. అంతకుముందు రెండు సార్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంది హర్షినా. అయితే కోజికోడ్ మెడికల్ కాలేజీలో సిజేరియన్ చేసినప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడేది.
Read Also: South Africa: రెండో వన్డేకు ముందు విషాదంలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్
మూడవ శస్త్రచికిత్స తరువాత నొప్పిని భరించే దానిని అని.. అయితే ఇది సిజేరియన్ వల్లే అని అనుకున్నానని..దీని కోసం చాలా సార్లు వైద్యులను సంప్రదించానని ఆమె చెప్పుకొచ్చారు. నా కడుపులో ఉన్న లోహపు వస్తువు మూత్రనాళాన్ని గుచ్చుకోవడంతో భరించలేని నొప్పి వచ్చేదని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి కడుపలోని ఫోర్సెప్స్ ను బయటకు తీశారు. ఈ ఘటనపై హర్షినా, వైద్యులపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ శనివారం విచారణకు ఆదేశించారు. దీనిపై నివేదిక సమర్పించాలని ఆరోగ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ కూడా విచారణకు ఆదేశించింది.