Disha Salian Case: మాజీ సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుని మరణించిందని, ఆమె మరణంలో ఎలాంటి తప్పు కనుగొనబడలేదని ముంబై పోలీసులు బాంబే హైకోర్టుకు సమర్పించారు. ఇటీవల, దిశ తండ్రి ఆమె సామూహిక అత్యాచారానికి గురైందని, హత్య చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల ప్రకటన ఆసక్తికరంగా మారింది.
దిశా సాలియన్ తన ఇష్టానుసారమే ఫ్లాట్ కిటికీ నుంచి కిందకు దూకిందని, పోస్టుమార్టం నివేదికలో మృతురాలిపై లైంగిక దాడి, శారీరక దాడికి సంబంధించిన ఆనవాళ్లు లేవని పోలీసులు గత నెలలో హైకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేశారు. కుటుంబంలో వివాదాలు, వ్యాపార ఒప్పందాలు పనిచేయకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు అఫిడవిట్‌లో చెప్పారు.
Read Also: UP: కారుతో తొక్కించి తండ్రి, సోదరుడి దారుణ హత్య.. ఆస్తి కోసం భార్యే ఉసిగొలిపింది..!
దిశా సాలియన్ జూన్ 8, 2020న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని నివాస భవనం యొక్క 14వ అంతస్తు నుండి పడి మరణించారు. ముంబై సిటీ పోలీసులు దీనిని యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట(ఏఆర్డీ)గా నమోదు చేశారు. తన కుమార్తె మరణంలో శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే హస్తం ఉందని, అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో దిశా తండ్రి సతీష్ సాలియన్ పిటిషన్ దాఖలు చేశారు. కొందరు ప్రభావవంతమైన వ్యక్తుల్ని రక్షించేందుకు, ఈ కేసును రాజకీయంగా కుట్రపూరితంగా కప్పిపుచ్చారని ఆరోపించారు.
దిశా సాలియన్ తన కుటుంబంతో వివాదం కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆమె వ్యాపార ఒప్పందాలు కూడా ఫలించలేదని మాల్వాణి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర నాగర్కర్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సంఘటన సమయంలో ఆమె తాగి ఉందని, ఆ సమయంలో ఆమెతో ఉన్న కాబోయే భర్త కూడా అనుమానాలను, ఊహాగానాలను తోసిపుచ్చారని పేర్కొన్నారు.