Constable Cracks Prestigious Exam: సివిల్స్ సాధించాలనేది లక్షలాది మంది కల. కానీ కొంతమందికే సొంతం అవుతుంది. పట్టుదల, దీక్ష, ఎన్నో ఏళ్ల ప్రయాస విజయాన్ని సాధించిపెడుతుంది. ఏటా కేవలం వెయ్యి పోస్టుల కోసం కొన్ని లక్షల మంది పోటీ పడుతుంటారు. ఇప్పుడు ఓ కానిస్టేబుల్ సివిల్స్ ప్రయత్నం ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆయన పేరే ‘‘రామ్ భజన్’’. సాధారణ కానిస్టేబుల్ నుంచి ఇప్పుడు ఏకంగా అధికారి స్థాయికి ఎదుగుతున్నారు. నిన్నటి దాకా ఎవరినైతే తాను రోజూ సార్..సార్.. అని ఎవర్ని పిలిచాడు.. రేపటి నుంచి వారే రామ్ భజన్ ను సార్ అనే రేంజ్ కు ఎదిగాడు.
ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రకటించిన ఫలితాల్లో రామ్ భజన్ 667వ ర్యాంక్ సాధించారు. పోలీస్ కానిస్టేబుల్ కొలువులో చేరే వరకు యూపీఎస్సీ ఉంటుందనే విషయం కూడా తనకు తెలియదని ఆయన అంటున్నారు. ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ లో కానిస్టేబుల్ గా ఉన్న రామ్ భజన్ సివిల్ సర్వీస్ కోసం 8 సార్లు ప్రయత్నించారు. 7 సార్లు విఫలం అయిన పట్టువదలని విక్రమార్కుడిలా 8వ సారి తాను అనుకున్నది సాధించారు.
Read Also: Congress: “9 ఏళ్లు.. 9 ప్రశ్నలు”.. కేంద్రానికి కాంగ్రెస్ ప్రశ్నల వర్షం
రాజస్థాన్ దౌసాలోని చిన్న గ్రామం నుంచి వచ్చని రామ్ భజన్.. 2009లో పోలీస్ సర్వీస్ లో చేరారు. 2015లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంక్ సాధించిన ఓ పోలీస్ అధికారి నుంచి ప్రేరణ పొందిన రామ్ భజన్ 8సార్లు ప్రయత్నించి ఫలితం సాధించారు. ‘‘ఇది సాధ్యమవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదని.. నాకు తెలిసిందల్లా నేను పుట్టిన పరిస్థితులు మార్చాలనేదే అని, ఢిల్లీ పోలీస్ సర్వీస్ లో చేరే వరకు యూపీఎస్సీ అంటే ఏమిటో కూడా తెలియదని’’ అన్నారు. ఇక్కడితోనే రామ్ భజన్ మిషన్ పూర్తి కాలేదు. మరింత మెరుగైన ర్యాంక్ కోసం మే 28న మళ్లీ ప్రిలిమ్స్ పరీక్ష రాయాలని యోచిస్తున్నాడు.
ఇటు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూనే రోజుకు 7-8 గంటలు చదువుకునే వాడినని, కొన్ని నెలల వరకు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. 2012లో 8వ తరగతి వరకు చదువుకున్న మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె భర్త స్పూర్తితో మళ్లీ చదువు కొనసాగిస్తుంది. రామ్ భజన్ కుటుంబం పేదరికం నుంచి వచ్చింది. 2020లో అతని తండ్రి మరణించాడు. అయినా ఎక్కడా కుంగిపోకుండా విజయం కోసం ప్రయత్నించాడు. ‘‘తాను ఆవు పేడతో పిడకలు చేశానని, ఆవులు, గేదెలు, మేకలను మేపుతున్నానని’’ అతని తల్లి కన్నీరు పెట్టుకుంటూ, కొడుకు విజయం గురించి ఆనందం వ్యక్తం చేసింది.