Shahid Afridi: షాహిద్ అఫ్రీది..క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియనివారు ఉండరు. మన దాయాది దేశమైన పాకిస్తాన్‌కి చాలా ఏళ్లు క్రికెట్ ఆడాడు. అయితే, పలు సందర్భాల్లో భారత్ అన్నా, హిందువులు అన్నా ద్వేష భావం అతడిలో కనిపిస్తుంటుంది. తాజాగా, పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఉగ్రవాదాన్ని సమర్థించాడు. ఈ నేపథ్యంలో అతడి యూట్యూబ్ ఛానెల్‌ని కేంద్రం బ్యాన్ చేసింది.
Read Also: Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..
ఇది ఒక వైపు మాత్రమే, మరోవైపు అఫ్రీదికి పాకిస్తాన్ ప్రభుత్వం, మిలిటరీ, ఆ దేశ గూఢచార సంస్థలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే కాకుండా అఫ్రీది బంధువుల్లో ఒకరు ఉగ్రవాద కమాండర్‌గా ఉండేవాడు. ఆయన బంధువు షకీబ్ అఫ్రిది ఉగ్రవాద సంస్థ ‘‘హర్కత్-ఉల్-అన్సార్’’ కమాండర్‌గా పనిచేశాడు. సెప్టెంబర్ 2003లో కాశ్మీర్‌లో దాడి చేయడానికి వచ్చి, అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు. ఈ ఆపరేషన్ సమయంలో స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇతడి గుర్తింపును బీఎస్ఎఫ్ నిర్ధారించింది. షకీబ్ చనిపోయే ముందు 2 ఏళ్ల కాశ్మీర్ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నాడు.
ఇదే కాకుండా, పాక్ రక్షణ, ఐఎస్ఐ వర్గాల్లో అఫ్రీది కుటుంబీకులు పలు కీలక స్థానాల్లో ఉన్నారు. అతడి కుమార్తె అన్షాని పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీదికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ వివాహానికి ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) మాజీ డైరెక్టర్ జనరల్ అసిమ్ సలీం బజ్వా కూడా హాజరయ్యారు. అఫ్రీది కుటుంబానికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు పాక్ సైనిక వర్గాలతో సంబంధాలు ఉండటంతోనే పలు సందర్భాల్లో భారత వ్యతిరేక, ఉగ్రవాద అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నాడు.