కొన్ని నెలలుగా ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వందలకొద్దీ శవాలను తాను పాతిపెట్టానంటూ ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం తవ్వకాలు జరిపింది. అయితే అతడు చెప్పినట్లు పెద్దగా ఆధారాలేమీ లభించలేదు. తాజాగా పారిశుద్ధ్య కార్మికుడు పూర్తిగా ప్లేట్ ఫిరాయించేశాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఇక్కడ మంజునాథ స్వామి కొలువై ఉన్నారు. అయితే గతంలో ఇక్కడ అనేక అత్యాచారాలు, హత్యలు జరిగాయని, తానే ప్రత్యక్ష సాక్షినంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. ధర్మస్థల ఆలయం ఇటీవల సంచలనాత్మక ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. 1995 నుంచి 2014 వరకూ మంజునాథ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన భీమా అనే వ్యక్తి జూన్ నెలలో పోలీసుల ముందుకొచ్చి సంచలన విషయాలు వెల్లడించాడు. తాను పని చేసిన కాలంలో వందలకొద్దీ అమ్మాయిలు, మహిళల మృతదేహాలను నేత్రావది నది ఒడ్డున పాతి పెట్టానని, వాళ్లంతా లైంగిక వేధింపులకు గురైన వారేనని వెల్లడించాడు. గతంలో ధర్మస్థలలో పలు మిస్సింగ్ కేసులు కూడా నమోదు కావడంతో అతని ఆరోపణలకు బలం చేకూరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసును సీరియస్ గా తీసుకున్న కర్నాటక ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ప్రణబ్ మహంతీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. కార్మికుడు చెప్పినట్లు దర్యాప్తు మొదలు పెట్టింది. పారిశుద్ధ్య కార్మికుడు సూచించిన 13 ప్రదేశాల్లో సిట్ తవ్వకాలు చేపట్టింది. కొన్నిచోట్ల అస్థిపంజరాలు, కొన్ని వస్తువులు లభించాయి. అయితే అవి సామూహిక ఖననాలకు సంబంధించినవి కావని తేలింది. ఇతర జబ్బులతో చనిపోయిన వాళ్ల అస్థికలుగా సిట్ గుర్తించింది. అయినా కార్మికుడు చెప్పిన ప్రతి ప్రాంతంలోనూ సిట్ తవ్వకాలు చేపట్టింది. కానీ అతను చెప్పినట్లు సామూహిక ఖననాల ఆనవాళ్లు లభించలేదు. పెద్దఎత్తున అస్థికలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ దొరకలేదు. దీంతో కార్మికుడి ఫిర్యాదుపై అనుమానాలు తలెత్తాయి.
సిట్ తవ్వకాల్లో సామూహిక ఖననాల ఆనవాళ్లు లభించలేదు. దీంతో కార్మికుడి ఫిర్యాదుపై అనుమానాలు తలెత్తాయి. ఇంతలో పారిశుద్ధ్య కార్మికుడే ప్లేట్ ఫిరాయించాడు. ధర్మస్థల మాస్ మర్డర్స్ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తాను చేసిన ఆరోపణలను పారిశుద్ధ్య కార్మికుడు ఉపసంహరించుకున్నాడు. తనకు ఎవరో ఓ వ్యక్తి ఒక పుర్రె ఇచ్చి దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని, అందుకే తాను అలా చేశానని వెల్లడించాడు. దీంతో కేసు పూర్తిగా తిరగబడింది. కార్మికుడు మాట మార్చడంతో అతని విశ్వసనీయతపై అనుమానాలు మొదలయ్యాయి. దీంతో అతనికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు సిట్ సిద్ధమైంది. ఇందుకోసం కోర్టు పర్మిషన్ తీసుకోనుంది. అంతేకాక, కార్మికుడితో అలా చెప్పించిన వాళ్లపైనే కేసు పెట్టి విచారించేందుకు సిట్ సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్లూ ధర్మస్థల ఆలయ నిర్వాహకులే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు పెద్దఎత్తున వినిపించాయి. కానీ ఇప్పుడు కార్మికుడు మాట మార్చడంతో కేసు స్వరూపమే పూర్తిగా మారిపోయింది.
ధర్మస్థల వ్యవహారంపై సోషల్ మీడియాలోనే కాక సామాజికంగా పెద్ద చర్చే జరిగింది. ఈ హత్య వెనుక ఉన్న వాళ్లెవరో తేల్చాలంటూ పెద్దఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి. ధర్మస్థల సామూహిక ఖననాల వ్యవహారం వెలుగులోకి రాగానే చాలా మంది దాని వెనుక ఉన్న పెద్దలెవరో తేల్చాలంటూ పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టారు. ధర్మస్థలలో గతంలో కూడా వందలాది మంది మిస్ అయ్యారని, వాటికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లభించలేదని చెప్పుకొచ్చారు. పోలీస్ రికార్డుల్లో కూడా అవి నమోదు కాలేదని, అలాంటి వాటన్నిటినీ వెలికి తీయాలని డిమాండ్ చేశారు. అయితే మరికొందరు మాత్రం ఇది హైందవ ధర్మంపై దాడిగా అభివర్ణించారు. హిందూమతంపై విషం చిమ్మడంలో భాగంగానే కొంతమంది ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కర్నాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఏకంగా ఫిర్యాదు దారుడే ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది.
పారిశుద్ధ్య కార్మికుడి విశ్వసనీయతపై ఇప్పుడు కేసు ఆధారపడి ఉంది. ముందొక మాట, తర్వాత మరో మాట చెప్పడంతో అందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. ఇందుకోసం సిట్ తదుపరి చర్యలు తీసుకుంటోంది. పారిశుద్ధ్య కార్మికుడి కొత్త వాదనతో సిట్ డైలమాలో పడింది. అందుకే లై డిటెక్టర్ పరీక్షల ద్వారా ఇతని ఫిర్యాదులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకే కోర్టు అనుమతితో లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఈ ఫిర్యాదు చేయించిన వ్యక్తులపైన కూడా సిట్ దర్యాప్తు చేపట్టనుంది. అప్పుడే ఈ కేసు వెనుక కుట్రలు బయటికొచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుడు పసలేని ఫిర్యాదులతో పోలీసులు, ప్రభుత్వం సమయాన్ని వృథా చేశాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ధర్మస్థల ఆలయ పవిత్రతను కాపాడాలని, నిర్వాహకులపై విషం చిమ్మిన వాళ్లను శిక్షించాలని కోరుతున్నారు.
ధర్మస్థల సామూహిక ఖననాల కేసు ఒక సంచలన ఆరోపణతో మొదలైంది. ఇప్పుడు రహస్య కుట్రలతో మరో మలుపు తీసుకుంది. పారిశుద్ధ్య కార్మికుడు యూటర్న్ తీసుకోవడం, తవ్వకాలలో ఆధారాలు లభించకపోవడం.. లాంటివి ఈ కేసును మరింత జటిలంగా మార్చేశాయి.