NTV Telugu Site icon

Amruta fadnavis: ఫడ్నవిస్ ప్రమాణస్వీకారంపై భార్య అమృత ఏమన్నారంటే..!

Amrutafadnavis

Amrutafadnavis

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారు. గురవారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఫడ్నవిస్ చేత గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. ఎన్డీఏ మఖ్యమంత్రుల సహా బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే ప్రమాణస్వీకార కార్యక్రమానికి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృతా ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అందమైన రోజుగా పేర్కొన్నారు. ఫడ్నవిస్ ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై.. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా అందమైన రోజుగా అభివర్ణించారు. చాలా సంతోషంగా ఉందని.. అలాగే మరింత బాధ్యత కూడా పెరిగిందని పేర్కొన్నారు.

ముంబైలో జరిగిన ప్రమాణస్వీకారంలో ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, చిరాగ్‌ పాశ్వాన్‌తో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాల్లో మహాయుతి 235 సీట్లతో భారీ విజయాన్ని సాధించింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో గెలుపొందగా… భాగస్వామ్య పక్షాలు శివసేన (యుబిటి), ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) వరుసగా 20, 10 స్థానాలను గెలుచుకున్నాయి.

 

Show comments