Devendra Fadnavis comments on uddhav thackeray: మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ఫడ్నవీస్ ను ఠాక్రే ఎప్పుడూ అంతం చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి నన్ను అంతం చేయాలని చూశారు.. అది మీల్ల కాలేదు అని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ ఫోటో చూపించి ఎన్నికల్లో పోటీ చేశారు.. ఆ తరువాత బీజేపీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారని ఉద్ధవ్ ఠాక్రే మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యర్థులు ఎంత కోరుకున్నా.. విధిలో ఏది రాసి ఉంటే అది మాత్రమే జరుగుతుందని ఫడ్నవీస్ అన్నారు.
Read also: Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉంటుంది వీరే.. కొత్తగా మరో ఇద్దరు నేతల పేర్లు
బుధవారం ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అతడు నిరాశలో మాట్లాడుతున్నాడని ఫడ్నవీస్ అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే.. అంతకుముందు రోజు సీఎం ఏక్ నాథ్ షిండేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఢిల్లీకి వెళ్లారని.. మహారాష్ట్ర ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నాయని.. ప్రశ్నించారు. ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం లేదా అని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు బృహత్ ముంబై కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించాలని.. శివసేన సత్తా చూపుతామని ఉద్దవ్, అమిత్ షాకు సవాల్ విసిరారు. గతంలో అనేక మంది నిజాంలు, షాలు ముంబైని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారని అది వాళ్ల వల్ల కాలేదని అన్నారు.
ఉద్దవ్ ఠాక్రే విమర్శలకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గట్టిగానే సమాధానం ఇచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే వర్గం చిత్తుగా ఓడిపోయిందని..ఐదో స్థానానికి చేరిందని.. బీజేపీకి చెందిన 294 మంది సర్పంచులు గెలుపొందారని.. అందుకే నిరాశలో ఉన్న ఆయన నన్ను విమర్శిస్తున్నారని అన్నారు. రేపు ఎన్నికలు జరిగినా.. బీజేపీ నెంబర్ 1 పార్టీగా ఉంటుందని.. ఉద్ధవ్ ఠాక్రే చాలా ఘోరంగా ఓడిపోతారని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ఆయన మానసిక స్థితి బాగా లేదని.. అందుకే అయోమయంలో ఉన్నారని.. అందుకే ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.