Delhi Woman Dies After Redmi 6A Smartphone Explodes: ఈమధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్లు పేలుతున్న సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ పేలుళ్ల కారణంగా కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ఓ మహిళ మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఆ మహిళ.. రెడ్‌మీ 6ఏ ఫోన్ వాడుతోంది. నిద్రపోవడానికి ముందు తన కుమారుడితో మాట్లాడి, ఫోన్ తన పక్కనే పెట్టుకొని నిద్రపోవడం ఈమెకు అలవాటు. ఎప్పట్లాగే ఇటీవల రాత్రి ఆర్మీలో విధులు నిర్వహించే తన కుమారుడితో మాట్లాడి, ఆమె మొబైల్ ఫోన్‌ని తన దిండు పక్కన పెట్టుకొని పడుకుంది. ఉదయాన్నే లేచి చూసేసరికి.. ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె ఎలా చనిపోయిందని అల్లుడు మంజీత్ చూడగా.. పక్కనే పేలిన రెడ్‌మీ కనిపించింది. దీంతో.. ఫోన్ పేలడం వల్లే ఆమె చనిపోయినట్టు నిర్ధారణ అయ్యింది.
ఈ ఘటనపై అల్లుడు మంజీత్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె చాలాకాలం నుంచి రెడ్‌మీ 6ఏ ఫోన్ వాడుతోంది. రాత్రి పడుకోవడానికి ముందు, దిండు పక్కనే ఫోన్ పెట్టుకొని పడుకుంది. మధ్య రాత్రిలో ఆ ఫోన్ పేలడంతో, మా ఆంటీ మరణించింది. ఇది మాకు చాలా విషాదకరమైన సమయం. ఇలాంటి సమయంలో మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత సదరు స్మార్ట్‌ఫోన్ సంస్థపైనే ఉంటుంది’’ అతడు రెడ్‌మీ ఇండియా, ఎక్స్ కో-ఫౌండర్ మను కుమార్ జైన్, షియోమి ఇండియా సీఎంఏ అనూజ్ శర్మని ట్యాగ్ చేశాడు. అంతేకాదు.. పేలిన మొబైల్ ఫోటోలతో పాటు రక్తపు మడుగులో ఉన్న తన ఆంటీ ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని రెడ్‌మీ సంస్థ వెల్లడించింది.
https://twitter.com/Mdtalk16/status/1568274660403605504?s=20&t=RFl4anHPhZ4M7_HcGOxxnw