ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న విమానాన్ని పాకిస్తాన్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్ని వచ్చింది. ఓ ప్రయాణికుడికి హెల్త్ ఇష్యూ రావడంతో విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు. సోమవారం ఉదయం 8.41 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నుంచి ఇండిగో 6ఈ-1736 బయల్దేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడికి ఆరోగ్య పరమైన సమస్య తలెత్తింది. పరిస్థితి విషమించడంతో విమానాన్ని కిందకు దించాల్సి వచ్చింది. దీంతో ఇండిగో విమానాన్ని పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో దించారు. దురదృష్టవశాత్తు విమానం ఆకాశంలోనే ఉండగానే సదరు ప్రయాణికుడి ప్రాణాలు కోల్పోయాడు. కరాచీ ఎయిర్ పోర్ట్ వైద్య సిబ్బంది ఈ మేరకు ధ్రువీకరించారు.
Also Read : Minister Harish rao: కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి.. వైద్య సేవలపై ఆరా
ఢిల్లీ నుంచి బయల్దేరిన విమానంలో 11 గంటలకు ఖతార్ చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం బయల్దేరిన కొద్ది సేపటికే అబ్దుల్లా అనే 60 ఏళ్ల నైజీరియన్ ప్రయాణికుడి ఆరోగ్యం బాగా విషమించింది. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది.. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కరాచీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే విమానం కరాచీలో ల్యాండ్ అయ్యేలోపే ఆ ప్రయాణికుడు మరణించాడు. కరాచీ వైద్య సిబ్బంది సైతం అతను మరణించినట్లు వెల్లడించారు. దాదాపు 5 గంటల పాటు విమానాన్ని కరాచీలోనే ఉంచి అధికారులు సంబంధిత ప్రక్రియలన్నీ పూర్తి చేశారు. అన్ని లాంఛనాలు పూర్తైన తర్వాత ఆ ఇండిగో విమానం తిరిగి ఢిల్లీకి బయల్దేరినట్లు అధికారులు తెలిపారు.
Also Read : Revanth Reddy: కవిత పై బండి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావు
ఈ ఘటనపై ఇండిగో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయాన్ని మాత్రం ఎయిర్ లైన్ అధికారులు వెల్లడించలేదు.. ప్రస్తుతం విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులను దోహా పంపించేందుకు ప్రయత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి మరణానికి గల కారణాలపై పూర్తి స్పష్టత రాలేదు. త్వరలోనే అబ్దుల్లా మృతికి గల కారణాలు వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.