Delhi-Mumbai Expressway: భారతదేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవేను నేడు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న సోహ్నా-దౌసా మధ్య నిర్మించిన రహదారిని ఆదివారం ప్రారంభించనున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేను ప్రాజెక్టును మొదలుపెట్టింది. 1,386 కిలోమీటర్లు పొడవైన ఈ రహదారి ఆర్థిక రాజధాని ముంబైని దేశరాజధాని ఢిల్లీని కలుపుతుంది. ఇది పూర్తయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణకాలం మరింతగా తగ్గతుంది. 180 కిలోమీటర్ల మేర దూరం తగ్గడంతో పాటు ఇప్పుడున్న 24 గంటల ప్రయాణకాలం 12 గంటలకు తగ్గిపోతుంది. ఏకంగా సగం కాలం ఆదా అవుతుంది. మొత్తం 8 లేన్లుగా ఈ రహదారిని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం తొలి విడతలో ప్రారంభిస్తున్న సోహ్నా-దౌసా రహదారి వల్ల ఢిల్లీ-జైపూర్ మధ్య రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడనుంది. గతంలో ఢిల్లీ-జైపూర్ మధ్యలో ప్రయాణానికి 4-5 గంటల సమయం పడితే, ప్రస్తుతం ఈ ఎక్స్‌ప్రెస్ వే తో కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గం నిర్మాణానికి కేంద్రం రూ. 10,400 కోట్లు ఖర్చుపెట్టింది. జైపూర్, అజ్మేర్, కోటా, ఉదయ్ పూర్, చిత్తోర్ ఘడ్, భోపాల్, ఉజ్జయిని, అహ్మదాబాద్, సూరత్, వడోదరా వంటి నగరాలను ప్రధాన ఈ ఎక్స్‌ప్రెస్ వే కలుపుతుంది.
Read Also: Turkey Earthquake: ఓ వైపు విషాదం, మరోవైపు దొంగతనాలు.. 48 మందిని అరెస్ట్ చేసిన టర్కీ..
ప్రత్యేకతలివే..
ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేకు 2019 మార్చి 9న కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. రాజస్థాన్, హరియానా, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ మీదుగా ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. మొత్తం ఈ రహదారి నిర్మాణానికి రూ. లక్ష కోట్లను వెచ్చిస్తోంది. దీని నిర్మాణం కోసం 80 లక్షల టన్నుల సిమెంట్, 12 లక్షల టన్నుల ఉక్కును ఉపయోగిస్తున్నారు. 8 లేన్లుగా నిర్మితం అవుతున్న ఈ రహదారిలో ఒక లైన్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం మాత్రమే.
ఫుడ్ స్టోర్లు, హోటళ్లు వంటివి రహదారిపై ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటళ్లు, హెలిప్యాడ్లు, మొత్తం 94 రకాల సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. రోడ్ వెంబడి 20 లక్షల మొక్కలను నాటుతున్నారు. మధ్యలో వచ్చే అభయారణ్యాల్లో జంతువులకు ఇబ్బంది కలుగకుండా.. భూగర్భం నుంచి రోడ్డు నిర్మించారు. ఇలాంటి సదుపాయాలు ఉన్న రోడ్డు ఆసియాలో మొదటిది కాగా.. ప్రపంచంలో రెండోది. 12 గంటల ప్రయాణ సమయం తగ్గడం వల్ల ఏటా 32 మిలియన్ లీటర్ల చమురు ఆదా అవడంతో పాటు 850 మిలియన్ కిలోల కర్భన ఉద్గారాలు తగ్గతాయి.