Delhi CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారాన్ని చేపట్టబోతోంది. దశాబ్ధకాలంగా ఉన్న ఆప్ అధికారానికి తెరిదించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా సత్తా చాటలేకపోయింది. 67 స్థానాల్లో దారుణంగా డిపాజిట్ కోల్పోయింది.
ఇదిలా ఉంటే, ఢిల్లీ కొత్త సీఎంగా ఎవరు ఉంటారనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారని, ముఖ్యమంత్రిగా ఒక మహిళా ఎమ్మెల్యేని నియమించొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కొత్త మంత్రి వర్గంలో మహిళలు, దళితులకు బలమైన ప్రాతినిధ్యం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ నుంచి నలుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. షాలిమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా ఆప్ నేత బందన కుమారిని 29,595 ఓట్లతో ఓడించారు, గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా రాయ్ ఆప్ కీలక నేత సౌరభ్ భరద్వాజ్‌ని 3188 ఓట్ల తేడాతో ఓడించారు. వజీర్ పూర్ నుంచి పూనమ్ శర్మ ఆప్ అభ్యర్థి రాజేష్ గుప్తాను మట్టికరిపించారు, నీలం పెహల్వాన్ నాజాఫ్‌గఢ్ నుంచి ఆప్ నేత తరుణ్ కుమార్‌పై 29 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.