ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో రచ్చ జరగుతూనే ఉంటుంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో అది బహిర్గతం అయ్యింది.. ఏకంగా సీఎం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.. తాజాగా, కోవిడ్ నిబంధనల విషయంలో ఆప్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి మోకాలడ్డారు ఎల్జీ అనిల్ బైజాల్.. అసలు విషయానికి వస్తే.. ఢిల్లీలో కల్లోలం సృష్టించిన కోవిడ్.. ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది.. వారం రోజులుగా పాజిటివిటీ రేట్‌తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలనే ఆలోచనలో ఉన్నామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు.. ఇదే ఇప్పుడు ఎల్జీకి నచ్చని అంశంగా మారింది.
Read Also: ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం
అయితే, కోవిడ్ విజృంభణతో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ, న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్, సదర్ బజార్ ట్రేడర్స్, ఇతర మార్కెట్ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలంటూ నిరసనకు దిగాయి.. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ తమ గోడువెల్లబోసుకున్నారు.. దీంతో.. వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలనే ఆలోచనకు వచ్చిన కేజ్రీవాల్ సర్కార్.. ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది.. కానీ, కేసుల సంఖ్య ఇంకా భారీగానే కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని తేల్చేశారు లెఫ్టినెంట్ గవర్నర్.. ఇదే సమయంలో 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య మరింత తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ఆప్ సర్కార్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు లెఫ్టినెంట్ గవర్నర్.