Delhi Car Blast: ఢిల్లీలో కార్ బాంబ్ ఘటన దేశాన్ని ఆందోళన పడేలా చేసింది. ఈ ‘‘వైట్ కాలర్’’ ఉగ్ర మాడ్యూల్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు బాంబు పేలుడుకు కారణమైన ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ, మిగతా తన ఉగ్రవాద అనుచరులకు పాలకుడిగా చెప్పుకునే వాడని, తనను తాను ‘‘ఎమిర్’’గా పిలుచుకునే వాడని తెలిసింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బుర్హాన్ వాని 2016లో భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు. బుర్హాన్ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉమర్ కోరుకునే వాడని తెలిసింది.
Read Also: IBomma Ravi Case : ఆ ఒక్క మెయిల్ రవిని పట్టించింది.. సంచలన విషయాలు చెప్పిన పోలీసులు
హర్యానాలో ఫరీదాబాద్‌లో అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తు్న్న డాక్టర్లతో పాటు పలువురు ఈ కేసులో అరెస్టయ్యారు. వీరిని ప్రశ్నిస్తున్న సమయంలో ఉమర్‌కు సంబంధించిన విషయాలు తెలిశాయి. జైషే మహ్మద్ ఉగ్రవాది మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా ఉమర్ ఉగ్రవాద మాడ్యూల్‌లోకి ప్రవేశించాడని విచారణలో వెల్లడైంది. ఉమర్ నబీకి ఉన్న హోదా, అనుభవంతో పోలిస్తే తాను కేవలం ఉగ్రవాద వర్కర్‌ను మాత్రమే అని అరెస్టయిన ముజమిర్ షకీల్ అధికారులతో చెప్పాడు. ఉగ్రవాదులు తమ పథకానికి ‘‘ఆపరేషన్ ఎమిర్’’ అని పేరు పెట్టారు.
ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీకి మొత్తం 9 భాషలు తెలుసని, ఉగ్రవాద మాడ్యుల్‌లో అత్యంత విద్యావంతుడు, తెలివైన వ్యక్తి అని అధికారులకు షకీల్ చెప్పినట్లు సమాచారం. ఉమర్ ఎల్లప్పుడూ భారత్‌లో ముస్లింలకు చెడు వాతావరణం ఉందని, మారణహోమానికి సిద్ధంగా ఉండాలని చెబుతుండే వాడని తెలిసింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించే ఆర్టికల్ 360, 35 ఏలను తొలగించడం కారణంగా ఉమర్, భద్రతా బలగాలపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నాడని విచారణలో వెల్లడైంది. 2023లో హర్యానా నుహ్ ప్రాంతంలోని మత హింసతో ద్వేషం మరింత ఎక్కువైనట్లు తెలిసింది.