Delhi Car Blast: ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ మొహమ్మద్‌కు మరో కారు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన దాడికి హ్యుందాయ్ ఐ20 కారును ఉపయోగించాడు. కారులో పేలుడు పదార్థాలు నింపి, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇదిలా ఉంటే, అతడికి ఉన్న రెండో కారు కోసం ఢిల్లీ, హర్యానా, యూపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Read Also: Delhi Car Blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్‌లో అమ్మోనియం నైట్రేట్ కన్నా శక్తివంతమైంది వాడారు.!
విచారణలో, ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కూడా ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలుస్తోంది. కారు నెంబర్ DL10CK0458, దీని కోసం పోలీసులు గాలింపును తీవ్రం చేశారు. ఎరుపు రంగు ఎకోస్పోర్ట్ కారు కనిపిస్తే వెంటనే అడ్డగించాలని అన్ని ఏజెన్సీలు, అధికారులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కారుకు ఉమర్ రెండో ఓనర్. పెట్రోలింగ్, పికెట్‌లో ఉన్న అందరు సిబ్బంది బయటే ఉండాలని, పూర్తిగా ఆయుధాలతో ఉండాలని, ఏదైనా సీసీటీవీ ఫుటేజీలో ఈ కారు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు అందాయి.