Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్ కేసులో విచారణ ముమ్మరమైంది. ఈ కేసును ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేతిలోకి తీసుకుంది. పలువురు డాక్టర్ ఉగ్రవాదులతో పాటు మరికొందరిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ బాంబులో ఏ పదార్థం వాడారో తెలుసుకునేందుకు నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ బృందం పరీక్షిస్తోంది. ముందుగా, ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్ మాత్రమే వాడినట్లు ప్రాథమికంగా అనుకున్నారు. అయితే, ఇదే కాకుండా హైగ్రేడ్ పేలుడు పదార్థాలు కూడా వాడినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పేలుడు ప్రాంతం నుంచి సేకరించిన నమూనాల్లో ఒకటి అమ్మోనియం నైట్రేట్ కన్నా శక్తివంతమైందిగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. పేలుడు పదార్థాలతో సహా 40కి పైగా నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారు. ప్రాథమిక విశ్లేషణ ప్రకరాం, పేలుడులో ఒకటి అమ్మోనియం నైట్రేట్ అని, రెండోది దీని కన్నా శక్తివంతమైందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
అమ్మోనియం నైట్రేట్, ఎరువుల్లో వాడే ఈ పదార్థం తెల్లని స్పటికా రూపంలో ఉంటుంది. ఇది శక్తివంతమైన ఆక్సిడైజర్‌గా పనిచేస్తుంది. సరైన పరిస్థితుల్లో ఇది పేలుడుకు కారణమవుతుంది. దీని ఫలితంగా అధిక ఉష్ణోగ్రత, మంటలు వ్యాపిస్తాయి. అమ్మోనియం నైట్రేట్ స్వయంగా పేలదు, దీనికి కొంత శాతం వేరే పదార్థాలను కలుపుతారు. ఢిల్లీ పేలుడులో దీనికి ఫ్యూయల్ ఆయిల్ కలిపారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 20కి పైగా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కొంత మంది బాధితుల ఊపిరితిత్తులు, చెవులు, పొత్తికడుపు దెబ్బతిన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు చెబుతున్నాయి. మరికొంది ఎముకలు చాలా చోట్ల విరిగాయి. ఈ కేసులో డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, అదీల్ రాథర్ లను అరెస్ట్ చేశారు. పేలుడుకు మరో డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పాల్పడినట్లు తెలుస్తోంది.