Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగే కొద్దీ డొంక కదులుతోంది. 26/11 ముంబై దాడుల తరహాలో ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో దాడుల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లో దాడులు చేయాలని కుట్ర చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నవంబర్ 26, 2008న ముంబై దాడుల సమయంలో, తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లియోపోల్డ్ హాస్పిటల్‌తో సహా 12 ప్రదేశాలలో పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ఇలాగే ఢిల్లీ వ్యాప్తంగా దాడులకు నిందితులు పథకం రచించారు.
Read Also: Onion and Garlic: భారత్ లో పూర్తిగా ఉల్లి, వెల్లుల్లిని నిషేదించిన ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా..
జనవరి నుంచే ఢిల్లీ దాడులకు కుట్ర జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్న ఉగ్రవాదులు మాడ్యూల్ నెలల తరబడి దాడులకు ప్రణాళికలు రచించింది. ఢిల్లీలో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్‌లోని హై ప్రొఫైల్ ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని, ఏకంగా 200 శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (IEDలు) బాంబుల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడానికి కుట్ర పన్నినట్లు తేలింది. జమ్మూ కాశ్మీర్ పుల్వామా, షోపియాన్, అనంత్ నాగ్‌లకు చెందిన కొంతమంది డాక్టర్లను ఉగ్రవాదులుగా మార్చినట్లు తెలుస్తోంది. వీరి ఉద్యోగాల కారణంగా ఎవరికి అనుమానం రాకుండా వీరిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. దీంతో వీరంత ఫరీదాబాద్ స్థావరంగా ఉగ్రదాడులకు తెరతీశారు.
వైద్యులు కావడంతో అనుమానం రాకుండా పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. రూంలను అద్దెకు తీసుకుని పేలుడు పదార్థాలను నిల్వ చేశారు. ముగ్గురు డాక్టర్లు- షాహీల్ సయీద్, ముజమ్మిల్ షకీల్ గనాలే, అదీల్ రాథర్‌లో పాటు సోమవారం ఆత్మాహుతి పేలుడులో మరణించిన డాక్టర్ ఉమర్ నబీ కూడా ఈ ప్లాన్‌లో కీలకంగా పనిచేశారు. ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సటీతో వీరందరికి సంబంధం ఉంది. ఉమర్ నబీ సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో ఐ20 కారులో పేలుడు పదార్థాలు తీసుకువచ్చి పేల్చాడు. ఈ దాడిలో 12 మంది మరణించారు. దీనికి ముందు దీపావళి రోజు రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేశారు. కానీ దానిని అమలు చేయలేదు.