ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా ఆప్-బీజేపీ పోటాపోటీగా వాగ్దానాలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపించాయి. బీజేపీ ఇప్పటికే రెండు మేనిఫెస్టోలు విడుదల చేయగా.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అనేక వాగ్దానాలు ప్రకటించింది. అయితే బీజేపీ కూడా మరో మేనిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతలో తామేమీ తక్కువ కాదంటూ ఆప్ కూడా మధ్యతరగతి ప్రజల కోసం మరో మేనిఫెస్టో ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఆప్ పార్టీ ఎంపీలు లేవనెత్తే ఏడు బడ్జెట్ డిమాండ్లను చేర్చారు.
ఇది కూడా చదవండి: Maoist Leader Chalapati: “భార్యతో సెల్ఫీ”.. మూల్యం చెల్లించుకున్న మావోయిస్ట్ నేత చలపతి..
భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంగానే తాము సంజీవని పథకాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విదేశాల్లో ఇలాంటి పథకాలు అమలు చేస్తే.. మనం మెచ్చుకుంటాం. అదే మన దేశంలో చేస్తే.. ఉచితాలని ముద్ర వేస్తున్నారన్నారు. ప్రజల సొమ్మును వారి ప్రయోజనాలకు వినియోగిస్తే.. దేశం అభివృద్ధి చెందుతుందని కేజ్రీవాల్ అన్నారు.
మధ్యతరగతి మేనిఫెస్టో ఇదే!
1. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ, విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్‌ను 2 శాతం నుంచి 10 శాతానికి పెంచడం
2. ఉన్నత విద్యకు రాయితీలు
3. ఆరోగ్య బడ్జెట్‌ను 10 శాతానికి పెంచడం. ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తివేయడం
4. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు
5. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తొలగింపు
6. సీనియర్ సిటిజన్స్ కోసం మరింత మెరుగైన పింఛను పథకాలు
7. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ కల్పించడం
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్ని్కల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే కాంగ్రెస్ కూడా తన ప్రయత్నం చేస్తోంది. ఆప్, బీజేపీ మాత్రం హామీల మీద హామీలు ప్రకటించేస్తున్నాయి. హస్తిన వాసులు ఈసారి ఎవరికి అధికారం కట్టబెడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: Danam Nagender: చింతల్బస్తీలో ఎమ్మెల్యే దానం హల్చల్.. కూల్చివేత అడ్డగింత