Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు సమయం ఎక్కువ లేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం చకచక పనులను పూర్తి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై అధికారులు పర్యటనలు నిర్వహించారు. ఈ నెల మధ్యలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీజేపీ తొలి విడతగా 195 ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఈ రోజు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సమావేశమవ్వనుంది. భద్రతను సమీక్షించేందుకు ఈసీ అధికారులు, హోం అధికారులతో భేటీకానున్నారు. రాష్ట్రాల్లో కేంద్ర బలగాల మోహరింపుపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శుక్రవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెత్‌తో సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం 3.4 లక్షల మంది కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను ఎన్నికల కమిషనర్ కోరారు. 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దేశం అంతటా దాదాపుగా 12.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.