Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో మూడో రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం కాగా.. స్కాట్ క్రిస్టియన్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మూడో రోజు యాత్రలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గతంలో రైతుల ఆత్మహత్యలను సూచిస్తూ పుర్రెలతో నిరసన తెలిపిన తమిళనాడు రైతులతో ఆయన సంభాషించారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.
రాహుల్ రెండోరోజు 20 కిలోమీటర్ల మేర నడిచారు. కన్యాకుమారిలోని అగస్త్యేశ్వరం నుంచి నాగర్‌కోయిల్ వరకు యాత్ర సాగింది. ఉదయం 7 గంటల నుంచి గం. 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం గం. 3.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు దారిపొడవునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఆయన మాట్లాడారు. దేశానికి సేవ చేయాలన్న ఆసక్తి, ఉన్నత భావాలు ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ రెండో రోజు పర్యటనలోనూ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేష్ బఘేల్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, ఏఐసీసీ పర్యవేక్షకులు దినేష్ గుండూరావ్, మాజీ మంత్రి పి.చిదంబరం, టీఎన్‌సీసీ రాష్ట్ర కోశాధికారి రూబి మనోహరన్, ఎంపీలు విజయ్ వసంత్, జ్యోతిమణి, తిరునావుక్కరసర్, చెల్లకుమార్, జయకుమార్, ఎమ్మెల్యేలు విజయతరణి, రాజేష్ కుమార్, ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర పోరాట సమయంలో గాంధీజీ సందర్శించిన సుచింద్రంలోని ఎస్ఎంఎస్ఎం హయ్యర్ సెకండరీ పాఠశాలను రాహుల్ సందర్శించారు. అలాగే, చిన్నారులకు సామాజిక కార్యక్రమాలు నిర్వహించే జవహర్ బాల్ మంచ్ సభ్యుల్ని కలిశారు. పెయింటింగ్‌లో ప్రతిభ చూపిన బాలలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ‘భారత్ జోడో’ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. పాఠశాలలో మొక్కను నాటారు. ఆ తర్వాత రైతు సమస్యలపై పోరాడుతున్న పౌర సమాజం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
India: నూకల ఎగుమతిపై తక్షణ నిషేధం విధించిన భారత్
2017లో నీట్ పరీక్షలో విఫలమైనందుకు ఆత్మహత్య చేసుకున్న ఎస్.అనిత కుటుంబ సభ్యులు రాహుల్‌ను కలిసి నీట్‌ను రద్దు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అనిత తండ్రి, సోదరుడు మణిరత్నం కాసేపు రాహుల్ వెంట నడిచారు. తాము అధికారంలోకి వస్తే నీట్‌ను బలవంతంగా రాష్ట్రాలపై రుద్దే పని చేయబోమని ఈ సందర్భంగా రాహుల్ హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ బుధవారం కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. యాత్ర కాశ్మీర్‌లో ముగుస్తుంది. ఇది 3,500 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. 12 రాష్ట్రాలను దాటుతుంది, పూర్తి చేయడానికి దాదాపు 150 రోజులు పడుతుంది.