Actor Darshan Case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. దర్శన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పాటు విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. జస్టిస్‌లు జె.బి. పర్దివాలా, విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం, కేసు విచారణ వేగం అత్యంత మందకొడిగా ఉందని పేర్కొంది.
రేణుకా స్వామి హత్య కేసులో 60 మంది కీలక సాక్షలు విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అవసరమైతే రోజూవారీ విచారణ జరిపేందుకు కూడా ట్రయల్ కోర్టుకు అనుమతి ఇచ్చింది. గత ఏడు నెలల్లో కేవలం 10 మంది సాక్షులను మాత్రమే విచారించారని, అయితే ప్రాసిక్యూషన్ 60 మంది కీలక సాక్షులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న చిన్న కారణాలతో విచారణ వాయిదా వేయకూడదని, విచారణకు డిఫెన్స్ సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఏడాదిలోగా విచారణలో స్పష్టమైన పురోగతి లేకుంటే దర్శన్ మళ్లీ కోర్టును ఆశ్రయించొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
దర్శన్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ప్రాసిక్యూషన్ 272 మంది సాక్షులను ప్రవేశపెట్టాలని భావిస్తోందని, అయితే ఇప్పటివరకు పురోగతి చాలా నెమ్మదిగా ఉందని అన్నారు. దర్శన్‌ను క్వారంటైన్ సెల్‌లో ఉంచారని, ఇతర ఖైదీలను కలవడానికి అతడిని అనుమతించడం లేదని కూడా ఆయన ఆరోపించారు. అయితే అలాంటిదేం లేదని ప్రభుత్వం తరుఫున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోర్టుకు తెలిపారు. ఇతర ఖైదీలను కలుసుకునేందుకు అతడిని అడ్డుకోలేదని చెప్పారు.
దర్శన్ లివ్ ఇన్ పార్ట్‌నర్‌గా భావిస్తున్న నటి పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలపై, చిత్ర దుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. దర్శన్‌తో సహా పలువురు నిందితులు అతడిని చచ్చేలా కొట్టారు. చివరకు చిత్రహింసలు తీవ్రం కావడంతో అతను మరణించారు. జూన్ 2024లో బెంగళూర్‌లోని షెడ్డులో మూడు రోజుల పాటు అతడిపై అమానవీయమైన దాడి జరిగింది. ఆ తర్వాత అతడి మృతదేహం సమీపంలోని కాలువలో లభ్యమైంది.
