NTV Telugu Site icon

Bihar: ‘‘డ్యాన్స్ చేస్తావా లేదా సస్పెండ్ చేస్తా’’.. పోలీసులపై లాలూ కుమారుడి జులుం..

Rjd

Rjd

Bihar: బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ హోలీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. శనివారం ఆర్జేడీ నేత తన మద్దతుదారులతో హోలీని జరుపుకుంటున్న సమయంలో, యూనిఫాంలో ఉన్న ఒక పోలీస్ అధికారి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన చర్యలపై అధికార జేడీయూ, బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

యూనిఫాంలో ఉన్న పోలీస్‌ని పాటకు డ్యాన్స్ చేయాలని ఆదేశించాడు. నిరాకరిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించాడు. ‘‘ నేను పాట ప్లే చేస్తాను, నువ్వు డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ చేయకుంటే, నిన్ను సస్పెండ్ చేయవచ్చు. బాధపడుకు, ఇది హోలీ’’ అని తేజ్ ప్రతాప్ హెచ్చరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. బీజేపీ, జేడీయూ పార్టీలు ఈ వివాదంపై ప్రతిపక్ష ఆర్జేడీ, లాలూ ప్రసాద్‌పై విరుచుకుపడ్డాయి.

Read Also: Pakistan: పాక్‌లో వరస దాడులు.. బలూచిస్తాన్‌లో ఆర్మీ కన్వాయ్‌పై ఎటాక్..

‘‘తండ్రిలాగే కొడుకు కూడా. మొదటి తండ్రి(లాలూ) సీఎంగా ఉన్నప్పుడు చట్టాన్ని తన పాటకు డ్యాన్స్ చేయించాడు. బీహార్‌ని జంగిల్ రాజ్‌గా మార్చాడు. ఇప్పుడు కొడుకు అధికారం లేనప్పటికీ బెదిరింపులు, ఒత్తిడి ద్వారా చట్టాన్ని అమలు చేసే అధికారులను డ్యాన్స్ చేయమని ఆదేశిస్తు్న్నాడు. డ్యాన్స్ చేయకుంటే సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఆర్జేడీ జంగిల్ రాజ్‌ని నమ్ముతుంది. వారు పొరపాటున అధికారంలోకి వస్తే చట్టాన్ని ఉల్లంఘించి, తమ సంరక్షకులను డ్యాన్స్ చేయిస్తారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. కాబట్టి వీరిని అధికారానికి దూరంగా ఉంచండి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.

జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ తీరుపై ఘాటుగా స్పందించారు. ‘‘ జంగిల్ రాజ్ ముగిసింది. కానీ లాలూ కుమారుడు యువరాజు ఒక పోలీసుని డ్యాన్స్ చేయాలని బలవంతం చేస్తూ, చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నాడు. తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ అయినా, లేదా లాలూ కుటుంబంలో ఎవరైనా, మార్పు దిశలో ఉన్న బీహార్‌లో ఇలాంటి వాతావరణానికి స్థానం లేదని గుర్తించాలి’’ అని అన్నారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.