Cyrus Mistry Accident: ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో చనిపోయారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ పై పోలీసులు విచారిస్తున్నారు. అత్యంత పటిష్టమైన, అధునాతన ఫీచర్లు, అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించే జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ వంటి కారు ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోవడంతో ఆ కంపెనీకి చెందిన ఓ టీం ప్రమాదంపై విచారణ జరుపుతోంది. కారు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలను సేకరిస్తోంది. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కార్ డేటాను డీక్రిప్ట్ చేయనున్నట్లు మంగళవారం పోలీస్ అధికారులు వెల్లడించారు.
ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి కార్ టైర్ ప్రెజర్, బ్రేక్ ఫ్లూయిడ్ లెవల్స్ వంటి ఇతర వివరాలను దర్యాప్తు చేయనుంది బెంజ్ కంపెనీ. ఈ విషయాన్ని కొంకణ్ రేంజ్ ఐజీ సంజయ్ మోహితే తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన అధికారులు ప్రమాదానికి గురైన కారు ఎన్‌క్రిప్టెడ్ డేటాను సేకరించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించి ప్రమాదానికి కారణాలను తెలియజేయనున్నారు. ఒక వేళ తక్కువ బ్రేక్ ఫ్లూయిడ్ ఉంటే స్పాంజ్ బ్రేక్ పెడల్స్ కు దారి తీస్తుందని.. ఇది ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు.
Read Also: Amazon Prime: అమెజాన్ కు బిగ్ షాక్.. రూ. 3700 కోట్లు నష్టం..?
ఆదివారం జరిగిన ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటు అతని స్నేహితులు గుజరాత్ నుంచి ముంబై వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కార్ డివైడర్ ను ఢీకొట్టడంతో సైరస్ మిస్త్రీతో పాటు జహంగీర్ పండోలు మరణించారు. మరో ఇద్దరు అనాహిత పండోలే, ఈమె భర్త డారియస్ పండోలే తీవ్ర గాయాలతో ముంబైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురు మెర్సిడెస్ బెంజ్ కారులో వస్తున్న క్రమంలో పాల్ఘర్ జిల్లా సూర్య నది వంతెన వద్ద కార్ ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.