NTV Telugu Site icon

Maharashtra: మహాయుతిలో విభేదాలు.. శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే అజిత్ పవార్ సమావేశం

Ajit Pawar

Ajit Pawar

Maharashtra: మహారాష్ట్రలోని బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ- ఏక్‌నాథ్ షిండే శివసేనల కూటమి ‘‘మహాయుతి’’లో విభేదాలు కనిపిస్తున్నాయి. అధికారిక కూటమిలో వివాదం పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్‌నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ సమావేశాన్ని అజిత్ పవార్ నిర్వహించారు.

రాయ్‌గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక నాయకులుగా ఇద్దరు ఎన్సీపీ నాయకుల నియామకాన్ని మహాయుతి ప్రభుత్వం నిలిపేసిన వారాల తర్వాత ఈ సమావేశం జరిగింది. ఇది కూటమిలో విభేదాలను మరింతగా పెంచింది. సంరక్షక మంత్రి జిల్లాకు వాస్తవ బాధ్యత వహిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్న జిల్లా ప్రణాళిక మరియు అభివృద్ధి కమిటీ (DPDC) సమావేశానికి కూడా మంత్రి అధ్యక్షత వహిస్తారు.

Read Also: Supreme Court: EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు..

రాయ్‌గఢ్ లో శివసేనకు చెందిన భరత గోగావాలే ఈ పదవిపై కన్నేశారు. అయితే, రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా ఉన్న ఎన్సీపీకి చెందిన అదితి తత్కరే కూడా ఈ పదవిపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేలతో చర్చించకుండా సమావేశం ఎందుకు జరిగిందో ఎన్సీపీ నాయకత్వం సమాధానాలు ఇవ్వాలని షిండే సేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ సమావేశం గురించి తమకు తెలియదని శివసేన ఎమ్మెల్యేలు తెలిపారు.

నిజానికి రాయ్‌గఢ్ జిల్లాలో శివసేన ఆధిపత్యం స్పష్టంగా ఉండటంతో, ఏక్‌నాథ్ షిండే తన వర్గానికి చెందిన నేతలకు గార్డియన్ మినిస్టర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. గత నెలలో దావోస్ మీటింగ్‌కి వెళ్లే సమయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాయ్‌గఢ్ సంరక్షక మంత్రిగా తత్కరే పేరుని ప్రకటించారు. అయితే, ఇది షిండేకు నచ్చలేదు. ఆ పదవిని తన పార్టీ నేతకు ఇవ్వాలని కోరారు. అయితే, షిండే అసంతృప్తితో ఈ నియామకాన్ని నిలిపేశారు. గత కొంత కాలంగా షిండే, సీఎం ఫడ్నవీస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.