Crackdown On Child Marriage: అస్సాంలో బాల్యా వివాహాలపై అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బాల్యవివాహాల అణిచివేతలో భాగంగా శనివారం వరకు రాష్ట్రంలో 2,250 మంది అరెస్ట్ చేసింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ 2026 అస్సాం ఎన్నికల వరకు కొనసాగుతుందని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,074 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. బిస్వనాథ్‌లో ఇప్పటి వరకు కనీసం 139 మంది, బార్‌పేటలో 128 మంది, ధుబ్రిలో 127 మంది పట్టుబడ్డారని పోలీసులు ప్రకటించారు.
ప్రస్తుతానికి బాల్య వివాహాలకు చేసిన తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నామని అరెస్ట్ చేయడం లేదని సీఎం వార్నింగ్ ఇచ్చారు. 2026 అస్సాం ఎన్నికల వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల బాల్య వివాహాల్లో 8 వేల మంది నిందితులుగా ఉన్నారు. తల్లిదండ్రులను విడిచిపెడితే అరెస్ట్ ఎదుర్కొనే నిందితుల సంఖ్య సుమారు 3,500 వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఖాజీల వ్యవస్థ( వివాహాలు నిర్వహించే ముస్లిం పెద్దలు)ను నియంత్రించాలని, అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అస్సాం సీఎం.
Read Also: AIMIM Big Plan: ఎంఐఎం బిగ్ స్కెచ్.. ఏకంగా 50 స్థానాలపై గురి..
14-18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006 కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అస్సాంలో మాతా మరియు శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో నమోదైన వివాహాలలో సగటున 31 శాతం వివాహాలు, చైల్డ్ మ్యారేజ్ లే కావడంతో ఈ సమస్య వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ నిర్ణయాన్ని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యేలు తప్పబడుతున్నారు. బడ్జెట్ తప్పులు, అదానీ వ్యవహారాన్ని పక్కకు పెట్టేందుకే హిమంత బిశ్వశర్మ ఇలా చేస్తున్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం అన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా దీన్ని తప్పుబడుతున్నారు. అరెస్టులు చేస్తే, పెళ్లయిన బాలికల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.