కరోనా మహమ్మారి కేసులు దేశంలో తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు మళ్లీ పెరిగిన కరోనా కేసులు తిరిగి తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 3.57 లక్షల మందికి కరోనా పరీక్షలను చేయగా వారిలో 1,569 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ముందు రోజు కంటే దాదాపు 600 కేసులు తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. మన దేశానికి కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు ఉందని కొన్ని రోజుల క్రితం నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. వారు చెప్పినట్టుగానే కేసులు క్రమంగా పెరుగుతూ కొన్ని రోజుల పాటు ప్రతి రోజూ 3 వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగించింది.
కానీ, ఇప్పుడు కొత్త కేసులు తక్కువగా నమోదవడంతో కొంత ఊరట లభించిందనే చెప్పాలి.. మరోవైపు, గత 24 గంటల్లో 2,467 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 16,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,84,710 మంది కోలుకున్నారు. మొత్తం 5,24,260 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 191 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.