Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీల్ కుదర్చుకున్నారని, ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు ఆమె కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రతిష్టను కంచపరుస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. మమతా బెనర్జీ ఈడీ, సీబీఐ దాడుల నుంచి తనని తాను రక్షించుకోవాలని అనుకుంటోందని అందుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు మమతాబెనర్జీ ముర్షిదాబాద్ లో పార్టీ అంతర్గత సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీజేపీ రాహుల్ గాంధీని ‘‘హీరో’’గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని, తద్వారా ప్రస్తుత సమస్యలపై దృష్టి మళ్లిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రధానిని ఎవరూ ప్రశ్నించకుండా రాహుల్ గాంధీని హీరోగా నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్ లో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ కర్యకలాపాలను నిలిపివేస్తూ.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.
ఇదిలా ఉంటే.. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ముందు ముర్షిదాబాద్, మాల్దా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకి చెందిన 2000 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు.