Love Jihad: కర్ణాటకలోని హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య ఆ రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదమైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. నేహా హిరేమత్(23) అనే ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదే కాలేజీకి చెందిన సీనియర్ ఫయాజ్ ఖోండునాయక్ దారుణంగా కత్తితో అనేకసార్లు పొడిచి చంపాడు. ఈ ఘటన మొత్తం కాలేజ్ క్యాంపస్‌లోనే జరిగింది. నిందితుడి విచారణ సందర్భంగా తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని చెప్పాడని, ఇటీవల తనకు దూరంగా పెట్టడంతోనే హత్య చేశాడని చెప్పాడు.
అధికార కాంగ్రెస్ పార్టీ ఇది వ్యక్తిగత కోణంలో జరిగిన సంఘటనలా చూపే ప్రయత్నం చేస్తో్ందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించిపోయాయని బీజేపీ పేర్కొంది. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని కేంద్ర మంత్రి, ధార్వాడ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ జోషి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను ఆపాలని బీజేపీ కోరింది. అయితే, కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర ఇందులో లవ్ జిహాద్ కోణం లేదని చెప్పాడు.
Read Also: Kohli DK: ‘నీ భార్య’.. అంటూ దినేష్ కార్తీక్ కు మాటరాకుండా చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..
మరోవైపు బాధిత యువతి తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ మాత్రం తన బిడ్డ హత్యకు కారణం లవ్ జిహాద్ అని పేర్కొనడం సంచలనంగా మారింది. నిరంజన్ హిరేమత్ మాట్లాడుతూ.. తన కూతురిని ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. ఈ ముఠా చాలా కాలంగా కుట్ర పన్నుతోందని, తన బిడ్డను ట్రాప్ చేయాలని అనుకున్నారని, ఈ నేపథ్యంలోనే ఆమెను బెదిరించారని, అయినప్పటికీ ఆమె బెదిరింపులను ఖాతరు చేయకపోవడంతోనే హత్య చేశారని మీడియాతో అన్నారు.
‘‘ నా కూతురికి ఏమైందో రాష్ట్రం, దేశం మొత్తం చూసింది. వాళ్లు పర్సనల్ అని చెబుతున్నారు, ఇందులో పర్సనల్ ఏం ఉంటుంది.. వారిద్ధరు బంధువులా..?’’ అని ఆయన ప్రశ్నించారు. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే అవినీతి, నేరం, మతహింస ఉందని చెప్పారు. ఒక రాష్ట్రంలో చట్టం, యంత్రాగం తప్పు చేసేవారిని శిక్షించేలా చూస్తుందని ప్రజలకు నమ్మకం ఉండాలి, కానీ ఈ విషయంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని అన్నారు.
అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, కర్నాటకలో గవర్నర్ పాలన విధించేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు హుబ్బళ్లిలోని విద్యానగర్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీతో పాటు రైట్ వింగ్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ముస్లిం నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.