Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?

  • తృణమూల్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం
  • హస్తిన మకాం వేసిన మమత, అభిషేక్
  • సోనియా, రాహుల్ గాంధీలతో వరుస భేటీలు
  • విలీనంపై చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు
Congresstmc

Congresstmc

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఓ వైపు నాయకులపై దాడులు.. ఇంకోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటు.. మమతా బెనర్జీకి తలనొప్పిగా మారాయి. ఒక్కొక్కరు పార్టీని వీడడంతో టీఎంసీ తీవ్ర రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల మధ్య ప్రస్తుతం మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ హస్తినలో మకాం వేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్ ‌గాంధీతో వరుస భేటీలు అవుతున్నారు. బుధవారం సోనియాగాంధీతో మమత, రాహుల్‌గాంధీతో అభిషేక్ బెనర్జీ భేటీ అయ్యారు. అరగంట పాటు ఏకాంత చర్చలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ చర్చలు కాంగ్రెస్‌లో తృణమూల్ కాంగ్రెస్ విలీనంపైనే జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను టీఎంసీ ఖండిస్తోంది. అలాంటిదేమీ లేదని చెబుతోంది. ఇండియా కూటమి బలోపేతం, 2029 లోక్‌సభ ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహం రూపొందించడంపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితులు, టీఎంసీ-కాంగ్రెస్ మధ్య సమన్వయాన్ని మరింత పెంచే అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.

×
×
Ad

టీఎంసీలో అంతర్గత సంక్షోభం

ఇదిలా ఉండగా టీఎంసీలో అంతర్గత అసంతృప్తి పెరుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. బుధవారం టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. “రెండు పడవలపై ప్రయాణం చేయాలనుకోవడం లేదు” అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అంతకుముందు మరో రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ కూడా రాజీనామా చేస్తూ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు “15 ఏళ్ల అరాచక పాలనకు ప్రతిబింబం” అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా టీఎంసీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు కోరినట్లు వార్తలు వస్తున్నాయి. తిరుగుబాటు వర్గానికి చెందిన ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సమాచారం. బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు.

విలీనంపై టీఎంసీ స్పష్టీకరణ

అయితే కాంగ్రెస్‌తో విలీనంపై వస్తున్న వార్తలను టీఎంసీ వర్గాలు ఖండించాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు కేవలం ఇండియా కూటమి సమన్వయాన్ని బలోపేతం చేయడానికేనని, సంస్థాగత విలీనంపై ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశాయి. ఇటీవల కాంగ్రెస్ ఎంపీఇమ్రాన్ మసూద్ టీఎంసీ-కాంగ్రెస్ విలీనం జరిగితే విపక్ష ఓట్లు చీలకుండా ఉంటాయని వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే టీఎంసీ నాయకులు మాత్రం కూటమి స్థాయి సహకారాన్ని విలీనంగా భావించరాదని.. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహం రూపొందించడమే లక్ష్యమని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్, టీఎంసీ మధ్య సమన్వయం మరింత పెరిగే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.