పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశాయి. ఈ మేరకు గ్యాస్ సిలిండర్‌కు దండలు వేసి డప్పులు కొడుతూ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గత 10 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం 9 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని మండిపడ్డారు. ఫకీర్‌ను ప్రశ్నలు అడగొద్దు.. కెమెరాల్లో జ్ఞానాన్ని పంచుకోండి అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. పొరుగు దేశాల్లో లేని చమురు ధరలు ఇండియాలో మాత్రమే ఎందుకు ఉన్నాయని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశాన్ని బీజేపీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనల్లో రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, అభిషేక్ సింఘ్వీ, అధిర్ రంజన్ చౌదరి, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.