కాంగ్రెస్ అధిష్ఠానంపై వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని ఆ పార్టీ సీనియర్ నేత అన్నారు. బాధ్యతలను అప్పగించేటప్పుడు విశ్వాసమున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉత్తర ప్రదేశ్‌లోని కీలక నేత జితిన్ ప్రసాద ఆ పార్టీని వీడి, భారతీయ జనతా పార్టీలో చేరడంపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద మిగిలిన అన్నింటికన్నా తన వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చారని మొయిలీ మండిపడ్డారు. జితిన్ వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉండేదన్నారు. ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక స్థానమైనా లభించలేదని, దీనిని బట్టి ఆయన అసమర్థుడని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ముఠగట్టుకున్న సంగతి తెలిసిందే.