Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు పరిష్కారం కావడం లేదు. ఇరువురితో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేధాలు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Read Also: Wrestlers Protest: అమిత్ షాను కలిసిన రెజ్లర్లు.. బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి..
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ నాథ్ ను ఎంపిక చేశారు. అయితే దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు విభేదిస్తున్నారు. మే 29న ఢిల్లీలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నేత గోవింద్ సింగ్ కు కమల్ నాథ్ విధేయుడైన ఎమ్మెల్యే సజ్జన్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది.
కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని, సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించడం కాంగ్రెస్ సంప్రదాయం కాదని, ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, వారు సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని అన్నారు. దీనికి ప్రతిస్పందగా సజ్జన్ సింగ్ మాట్లాడుతూ.. గోవింద్ సింగ్ ను ప్రతిపక్షనేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారో లేదో మర్చిపోతారని.. అతను ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడలేదని, సీనియర్ వ్యక్తి కావడం వల్లే ప్రతిపక్ష నేతగా నియమించామని అన్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు, పార్టీ నాయకులు కమల్‌నాథ్‌ను సీఎంగా కోరుకుంటున్నారని అన్నారు. హాజరైన 22 మంది నేతలు కమల్ నాథ్ ను తమ నాయకుడిగా అంగీకరించినట్లు సమావేశంలో నిర్ణయించారని తెలుస్తోంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా కమల్ నాథ్ నాయకత్వంలో ఎన్నికలు జరగాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారని అన్నారు.