West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకుడి హత్య చోటు చేసుకుంది. ఉదయం తుపాకీ కాల్పులు, బాంబులు విసిరి కాంగ్రెస్ నాయకుడిని చంపినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన కాంగ్రెస్ నేతని షేక్ సైఫుద్దీన్‌గా గుర్తించారు. ఇతను మాణిక్‌చక్‌లోని గోపాల్ పూర్ ప్రాంతానికి చెందిన కీలక నేత. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతు ఉన్న గుండాలే సైఫుద్దీన్‌ని హత్య చేశారని అతడి కుటుంబం ఆరోపించింది. అయితే, అధికార టీఎంసీ మాత్రం వారి ఆరోపణల్ని తోసిపుచ్చింది.
Read Also: Lorry Incident: కూరగాయల షాపులోకి దూసుకెళ్లిన లారీ.. నుజ్జునుజ్జయిన ద్విచక్రవాహనాలు
ఆదివారం ఉదయం 9 గంటలకు ధరంపూర్ స్టాండ్ మార్కెట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖానికి ముసుగులు కప్పుకున్న నలుగురైదుగురు గుండాలు సైఫుద్దీన్‌పై కాల్పులు జరిపారని, అతడిని లక్ష్యంగా చేసుకుని రెండు క్రూడ్ బాంబుల్ని విసిరారని కుటుంబీకులు చెప్పారు. ఈ దాడిలో అతనున అక్కడిక్కడే మరణించాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనక ఎవరున్నారనే విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.