వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ మళ్లీ గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటోంది. అందుకు ఉదయ్ పూర్ లో జరిగే ‘ శింతన్ శిబిర్’ వేదిగా మారబోతున్న సంకేతాలు ఇస్తోంది. శుక్రవారం నుంచి రాజస్థాన్ ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శింతన్ శిబిర్ పేరుతో పెద్ద ఎత్తున సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కీలక నేతలు రాజస్థాన్ వెళ్తున్నారు. కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే రాజస్థాన్ ఉదయ్ పూర్ బయలుదేరారు. ఢిల్లీ నుంచి రైలు మార్గం ద్వారా రాజస్థాన్ వెళ్లనున్నారు. ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్ లో రైల్వే పోర్టర్లతో కాసేపు ముచ్చటించారు రాహుల్ గాంధీ. ఇదిలా ఉంటే రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ లోని కాంగ్రెస్ సర్కార్ శింతన్ శిబిర్ కోసం ఏర్పాట్లు చేసింది.
కాగా… ఉదయ్ పూర్ లో జరిగే శింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ పూర్తిస్థాయిలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను వేరే వారికి అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. పార్టీలో మెజారిటీ నాయకులు కూడా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత, సంస్థాగత అంశాలు ఈ ఆరు అంశాలపై తీర్మానాలను రూపొందించేందుకు సోనియా గాంధీ కమిటీలు ఏర్పాటు చేసింది.
వీటితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతల గ్రూప్ జీ 23 సూచించినట్లు పార్లమెంటరీ బోర్డు యంత్రాంగాన్ని పునరుద్ధరించే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు ‘ ఒకే కుటుంబం..ఒకే టికెట్’ నిబంధనలను కూడా అమలు చేయాలని మరో ప్రతిపాదన కూడా ఉంది. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై కూడా చింతన్ శిబిర్ లో తీర్మాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు తీసుకురావాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ నిర్మాణం… కీలక సూచనలను ఇంటర్మ్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, కీలక నేతలకు వివరించారు.