Kolkata rape-murder Case: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో జరిగిన దారుణ ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేస్తోంది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రేపు బెంగాల్ బంద్‌కి బీజేపీ పిలుపునిచ్చింది.
ఈ ఘటనలో నిందితులకు సీఎం మమతా బెనర్జీ రక్షణ కల్పిస్తున్నారని బీజేపీ మంగళవారం ఆరోపించింది. సీబీఐ ఆమెకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. కోల్‌కతాలో జరిగిన ఆందోళనల్లో నిరసరకారులపై లాఠీచార్జిపై స్పందించిన బీజేపీ.. మమతా బెనర్జీని నియంతగా అభివర్ణించింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
Read Also: J P Nadda: “వాహ్..దీదీ.. రేపిస్టులకు సాయం చేయడం గౌరవం?.. మహిళల భద్రతపై ప్రశ్నించడం నేరమా?”
కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్‌కి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. నిరసనకారులపై పోలీసుల బలప్రయోగాన్ని ఖండించింది. పశ్చిమ బెంగాల్‌లో ఏం జరిగినా ఆందోళనకరమే అని, ఇది రాజ్యాంగాన్ని ముక్కలు చేయడం లాంటిదని అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా న్యూఢిల్లీలో ఆరోపించారు. అత్యాచారం, హత్యని ఆత్మహత్యగా పోలీస్ కమిషనర్ పేర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. రాజీనామా3 చేసి విచారణ ఎదుర్కోవాలని అన్నారు. నిజం బయటకు రావాలని, ఈ కేసును సీబీఐ విచారిస్తోందని, మమతా బెనర్జీ, పోలీస్ కమిషనర్‌కి పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించాలని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, ‘నబన్న అభిజన్’ ర్యాలీలో శాంతియుతంగా పాల్గొన్న వారిపై పోలీసులు “క్రూరమైన అణచివేత”కి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌ను రాష్ట్ర పరిపాలనా దౌర్జన్యాలు ఆపకుంటే అడ్డుకుంటామని చెప్పారు. సంత్రాగచ్చిలో శాంతియుత నిరసనకారులపై పోలీసులు వాటర్ క్యానర్లు ప్రయోగిస్తున్నారని, హౌరా బ్రిడ్జి వద్ద విద్యార్థులపై టియర్ గ్యాస్ పేల్చారని దయచేసి వెంటనే ఈ క్రూరత్వాన్ని వెంటనే ఆపాలని ఆయన కోరారు. పోలీసు కమిషనర్ వినీత్ గోయల్, డీజీపీ ఇటువంటి క్రూరత్వాన్ని ఆపకపోతే, మేము ఖాళీగా కూర్చోమని హెచ్చరించారు.
