Site icon NTV Telugu

CAA: సీఏఏ అమలుని నిశితంగా గమనిస్తున్నాం: అమెరికా..

Caa

Caa

CAA: భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలకు ఎంత నిధులు వచ్చాయి..?

ఇదిలా ఉంటే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా సీఏఏ గురించి మాట్లాడింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ఈరోజు తెలిపింది. సీఏఏ మతస్వేచ్ఛను ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారా..? అనే మీడియా అడిగిన ప్రశ్నకు.. భారతదేశం దీనిని ఎలా అమలు చేస్తుందనేదాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఈ రోజు అన్నారు. ‘‘మార్చి 11న పౌరసత్వ (సవరణ) చట్టం నోటిఫికేషన్ గురించి మేము ఆందోళన చెందుతున్నాము. మేము ఈ చట్టాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాము’’ అని చెప్పారు. మత స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు సమానమైన చట్టాన్ని అందించడం ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రమని వెల్లడించారు.

డిసెంబర్ 31, 2014 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, బౌద్ధులు వంటి ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని సీఏఏ అందిస్తుంది. వలసదారులకు పౌరసత్వం కోసం దరఖాస్తు అర్హత 11 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. సీఏఏ భారత ముస్లింల పౌరసత్వాన్ని హరించదని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర హోమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Exit mobile version