ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి కొలీజియం సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 29న మన్మోహన్ ఢిల్లీ హైకోర్టు 32వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకముందు నవంబర్ 9, 2023న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను అత్యున్నత న్యాయస్థానానికి పదోన్నతి కల్పించేందుకు ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Mulugu: ములుగు నియోజకవర్గంలో కొత్తగా మరో మండలం.. మాట నిలబెట్టుకున్న మంత్రి
సుప్రీంకోర్టు వర్గాల ప్రకారం… భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. కొలీజియంలోని ఇతర సభ్యులు జస్టిస్‌లు బీఆర్ గవాయ్, సూర్యకాంత్, హృషికేష్ రాయ్, ఏఎస్ ఓకా సిఫార్సు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్ హిమా కోహ్లీ, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్‌లు పదవీ విరమణ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.
మన్మోహన్ బ్యాగ్రౌండ్ ఇదే..
జస్టిస్ మన్మోహన్.. జమ్మూ మరియు కాశ్మీర్ గవర్నర్‌గా మరియు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేసిన ప్రముఖ బ్యూరోక్రాట్ నుంచి రాజకీయవేత్తగా మారిన దివంగత జగ్మోహన్ కుమారుడు. సీనియర్ న్యాయవాదిగా ఉన్న జస్టిస్ మన్మోహన్ మార్చి 13, 2008న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డిసెంబర్ 17, 2009న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి న్యాయ పట్టా పొందారు. తర్వాత 1987లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra CM: మహారాష్ట్ర సీఎం దేవేంద్రుడేనా..? డిప్యూటీలుగా షిండే, పవార్..