College girl killed after being pushed in front of moving train in Chennai: చెన్నైలో దారుణం జరిగింది. ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది యువతిని రైలు కింద తోసేసి హత్య చేశాడు. ఈ ఘటన చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ లో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది. అందరూ చూస్తుండగానే సతీష్ అనే వ్యక్తి 20 ఏళ్ల సత్యప్రియను తోసేయడంతో రైలు కింద పడి మరణించింది. సత్యప్రియ, సతీష్ ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Airbus A380: ప్రపంచంలోనే అతిపెద్ద విమానం.. రేపు బెంగళూర్‌లో తొలిసారి ల్యాండింగ్
పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం చెన్నైలోని ఆదంబాక్కంకు చెందిన సత్యప్రియ(20) నగరంలోని ఓ కాలేజీలో బీకాం చదువుతోంది. మృతురాలి తల్లి పోలీస్ కానిస్టేబుల్ కాగా.. తండ్రి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సతీష్(32)కు సత్యప్రియతో పరిచయం ఉంది. ఈ ఘటన జరగడానికి ముందు రైల్వే స్టేషన్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తాంబరం నుంచి ఎగ్మోర్ వైపు వెళ్తున్న రైలు కిందకు సత్యప్రియను ప్లాట్‌ఫారమ్‌పై నుంచి తోసేశాడు. రైలు కింద పడి సత్యప్రియ అక్కడిక్కడే మరణించింది.
అయితే వీరిద్దరి మధ్య వివాదం నడుస్తోందని..వారి కుటుంబాలకు కూడా తెలుసని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన జరిగిన తర్వాత సతీష్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నై పొలీస్ కమిషనర్ శంకర్ జివాల్ తెలిపారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. నిందితుడు సతీష్ కోసం ఏడు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. 2016లో కూడా ఐటీ ఉద్యోగి స్వాతిని కూడా ఇలాగే హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది.