కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా తరువాత కొత్త సీఎం ఎవరు అనే దానిపై నిన్నటి నుంచి కసరత్తులు జరుగుతున్నాయి. నిన్నటి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాలు పార్లమెంట్ ఆవరణలో భేటీ ఆయ్యి చర్చించారు. అధిష్టానం ముందుకు వచ్చిన పేర్లను పరిశీలించారు. అనంతరం సీఎం అభ్యర్థి ఎవరు అని నిర్ణయించే బాధ్యతను కేంద్ర మంత్రులైన ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డిలకు అప్పగించింది కేంద్రం. కాసేపట్లో ఈ ఇద్దరి కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగబోతున్నది. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలంతా హాజరుకాబోతున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని ఇప్పటికే అధిష్టానం సూచించింది. కేంద్ర మంత్రుల ముందుకు బసవరాజు బొమ్మై, సీటీ రవి, అరవింద్ బెళ్లాడ్ పేర్లు వచ్చాయి.
Read: రోల్స్ రాయిస్ కేసులో విజయ్ కు ఊరట
అయితే, యడ్యూరప్ప తన సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మై వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రేసులో బసవరాజు బొమ్మై ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బొమ్మై కర్నాటక హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఆర్ బొమ్మై కుమారుడు కావడం, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు సీఎం పదవి అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 2023లో కర్నాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక బసవరాజు రెండు సార్లు ఎమ్మెల్సీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 లో జనతాదళ్ పార్టీకి నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు బసవరాజు బొమ్మై.