CJI UU Lalit recommends Justice D Y Chandrachud as next Chief Justice of India: భారత 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ తన వారసుడిగా కేంద్రానికి పేరును సూచించారు. దీనిపై కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ లలిత్ లేఖ రాయనున్నారు. నవంబర్ 8న జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ చేయనుండటంతో ఈ మేరకు కేంద్రం తదుపరి సీజేఐ పేరును సూచించాలని లేఖ రాసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో ఎక్కువ సీనియారిటీ ఉన్నవారిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకుంటారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల్లో డీవై చంద్రచూడ్ సీనియర్ గా ఉన్నారు.
Read Also: School Girl Marriage At Bus Stop: బస్టాండ్‌లోనే స్కూల్ విద్యార్థినికి తాళి కట్టేశాడు.. అంతా షాక్..
నవంబర్ 9న డీవై చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోనున్నారు. దాదాపుగా 2 ఏళ్లు ఆయన సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2024 నవంబర్ 10 రిటైర్ కానున్నారు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు చంద్రచూడ్. 1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. 1986లో హార్వర్డ్ లో జ్యూడిషియరీ సైన్స్ లో డాక్టరేట్ పూర్తి చేశారు. చంద్రచూడ్ గతంలో అలహాబాద్ హైకోర్టు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ లీగర్ సర్వీస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
గత ఆగస్టులో సీజేఐగా పదవీ బాధ్యతలు తీసుకున్న జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. దాదాపుగా 74 రోజుల పాటు ఆయన సీజేఐగా పనిచేయనున్నారు. గతం వారం తన వారసుడి పేరును సూచించాలని కేంద్ర న్యాయశాఖ సీజేఐ జస్టిస్ లలిత్ కు లేఖ రాసింది. కాగా జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ సుప్రీంకోర్టు 16వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన గతంలో 1978-85 వరకు ఏడేళ్లపాటు సీజేఐగా పనిచేశారు. దీంతో సుదీర్ఘకాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా ఆయన కుమారుడు సీజేఐగా కానున్నారు.