India China: చైనా-పాకిస్తాన్-బంగ్లాదేశ్ కలిసి దుష్ట పన్నాగాన్ని పన్నుతున్నాయి. భారత్‌ని చుట్టుముట్టేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇటీవల ఈ మూడు దేశాలు కలిసి త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. చైనా చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడం భారత్‌కి ఆందోళన కలిగించే విషయం. గతంలో, షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత అనుకూల వైఖరిని అవలంభించేంది. ఎప్పుడైతే మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు పాకిస్తాన్, చైనాలు భారత్‌కి ఎప్పటి నుంచో శత్రు దేశాలుగా ఉన్నాయి.
మీడియా నివేదికల ప్రకారం, ఈ సమావేశంలో చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్, బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ కార్యదర్శి రుహుల్ ఆలం సిద్ధిఖీ, పాకిస్తాన్ అదనపు విదేశాంగ కార్యదర్శి ఇమ్రాన్ అహ్మద్ సిద్ధిఖీ పాల్గొన్నారు, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ కూడా వీడియో లింక్ ద్వారా చైనాలోని కున్మింగ్ నగరంలో జరిగిన చర్చలలో పాల్గొన్నారు. ఈ త్రైపాక్షిక సమావేశంపై బలోచ్ చైనాను ప్రశంసించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పింది. చైనా, దక్షిణాసియా దేశాలతో పాకిస్తాన్ లోతైన సంబంధాలను కోరుకుంటోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది.
Read Also: Kolkata Gang Rape: కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం..
ఈ అధికార ప్రకటనలో ఈ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని చెప్పింది. అయినప్పటికీ, ఈ మూడు దేశాలను ఇప్పుడు భారత్ నమ్మే పరిస్థితి లేదు. వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం, విద్య, సముద్ర వ్యవహారాలు, వివిధ రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని చైనా, పాక్, బంగ్లా విదేశాంగ కార్యదర్శులు అంగీకరించారు. త్వరలో ఈ మూడు దేశాలు ఒక వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం, భారత్‌కి మూడు వైపులు ఉన్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు భారత వ్యతిరేకతకు మారుపేరుగా ఉన్నాయి. చైనా-పాకిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో చిక్కటి స్నేహం ఉంది. గతంలో భారత్ వైపు బంగ్లాదేశ్ ఉన్నప్పటికీ, షేక్ హసీనా తర్వాత పరిణామాలు మారాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత పెరిగింది. పాకిస్తాన్ చేసిన అరాచకాలను మరిచిన బంగ్లాదేశ్ ఆ దేశంలో సన్నిహితంగా మెలుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు దేశాల పట్ల భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.