Woman Fights Wild boar: ఎంతటి కష్టం వచ్చినా కూడా తన బిడ్డలను కాపాడుకుంటుంది అమ్మ. తన పిల్లలకు కష్టం వస్తుందంటే ఎందాకైనా పోరాడుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది. తన కూతురును రక్షించుకోవడానికి 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాడింది. చివరకు తాను ప్రాణాలు కోల్పోయి, కూతురును రక్షించుకుంది. ఈ విషాదకర సంఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో జరిగింది. తల్లి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది ఈ ఘటన.
Read Also: Pawan Kalyan: చరణ్- ఎన్టీఆర్ ఫ్యాన్ వార్.. మధ్యలో ఇరుక్కుపోయిన పవన్
వివరాల్లోకి వెళితే చత్తీస్ గఢ్ కోర్బా జిల్లా పసన్ అటవీ ప్రాంతంలో తేలియామర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దువ్‌సియా బాయి(45) తన కూతురు 11 ఏళ్ల రింకీతో కలిసి పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అడవి పందీ రింకీపై దాడి చేసింది. ఇది గమనించిన దువ్‌సియా బాయి కూతురుని రక్షించేందుకు అడవి పందితో వీరోచితంగా పోరాడింది. తన ప్రాణాలను పణంగా పెట్టి కూతురును దాడి నుంచి కాపాడింది. దాదాపు 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాడింది.
ఈ పోరాటంతో దువ్‌సియా బాయి, అడవి పందిని హతమార్చి తను కూడా ప్రాణాలను కోల్పోయింది. గాయాలపాలైన రింకీ గ్రామం వైపు పరుగులు తీసుకుంటూ వెళ్లి విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. గ్రామస్తులు అందించిన సమాచారంతో అటవీ, పోలీస్ శాఖలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే దువ్‌సియా బాయి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. రింకీని చికిత్స నిమిత్తం పసన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.