Chennai: చాలా కంపెనీలు ఉద్యోగుల కన్నా వారికి వచ్చే లాభాలపైనే దృష్టి పెడుతాయి. మనం ఈ స్థాయికి వెళ్లేందుకు ఉద్యోగులు సహకరించారనే విషయాన్ని మరిచిపోతుంటాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు కార్లు, బంగ్లాలు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా చెన్నైకి చెందిన ఓ కంపెనీ 1000 మంది ఉద్యోగులను స్పెయిన్‌లోని బార్సిలోనాకు వారం రోజుల పాటు అన్ని ఖర్చులతో టూర్ ఏర్పాటు చేసింది. చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కాసాగ్రాండ్ ఈ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘‘ప్రాఫిట్-షేర్ బోనాంజా’’ కార్యక్రమంలో భాగంగా గతేడాది కంపెనీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంతో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు ఈ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. “కంపెనీ గత ఆర్థిక సంవత్సరం అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తుల అంకితభావం, నిబద్ధత మరియు సహకార స్ఫూర్తిని గుర్తించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపిక చేసిన ఉద్యోగుల్లో వివిధ హోదాలు, విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నుంచి సీనియర్ లీడర్ షిప్ వరకు ఉద్యోగులు ఉన్నారు.
Read Also: Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య, చరణ్ సినిమాలన్నీ అద్భుతంగా ఆడాలి!
‘‘ఈ స్పెయిన్ ట్రిప్‌లో ఉద్యోగులు సగ్రడా ఫ్యామిలియా, పార్క్ గుయెల్, మోంట్‌జుక్ కాజిల్ వంటి ఐకానిక్ ల్యాండ్ మార్క్‌లకు వెళ్తారు. భారత్, దుబాయ్ కార్యాలయాల్లోని ఉద్యోగులను ఒక చోట చేర్చి సుందరమైన, గొప్ప సాంస్కృతిక, చారిత్రక, సుందరమైన ప్రదేశాలు కలిగిన స్పెయిన్ అందాలను ఆస్వాదించడానికి వారిని ఆహ్వానిస్తుంది. ’’ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
కాసాగ్రాండ్ గ్లోబల్ రికార్డ్ ప్రోగ్రామ్ 2013 నుంచి సంప్రదాయంగా తన ఉద్యోగుల్ని ఇలా టూర్లకు పంపుతోంది. గత కొన్ని ఏళ్లుగా సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక, దుబాయ్, మలేషియా, లండన్‌తో సహా అనేక విదేశీ ప్రాంతాలకు ఉద్యోగుల్ని పంపుతోంది. 2021లో ఉద్యోగులు దుబాయ్, అబుదాబి టూర్‌కి వెళ్లారు. 2022లో స్విట్జర్లాండ్, 2023లో ఆస్ట్రేలియా టూర్లకు వెళ్లారు.