Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆప్ మంత్రి అతిషీ నిరవధిక నిరాహార దీక్షను చేప్టటారు. అయితే, ఆందోళన స్థలంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. అతిషీ నిరాహారదీక్ష అంతా బూటకమని బీజేపీ ఆరోపించింది. దక్షిణ ఢిల్లీలోని భోగత్‌లో శనివారం గందరగోళం ఏర్పడింది. అతిషీ చేస్తున్న నిరాహార దీక్ష శనివారంతో రెండో రోజుకు చేరుకుంది.
నిరసనకారులు కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యమునా నదిలో ఢిల్లీకి రావాల్సిన వాటాను హర్యానా విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ మంత్రి అతిషీ శుక్రవారం నిరాహార దీక్షకు కూర్చున్నారు. ‘‘ జల్ సత్యాగ్రహా’’ పేరుతో ఆమె నిరాహార దీక్ష చేస్తోంది. హర్యానా ప్రభుత్వం, ఢిల్లీలోని ప్రజలకు ఎక్కువ నీటిని విడుదల చేసే వరకు తాను ఏమీ తిననని చెప్పారు. హర్యానా శుక్రవారం రోజు 110 మిలియన్ గ్యాలన్ల (MGD) తక్కువ నీటిని విడుదల చేసిందని అతిషి చెప్పారు. ఒక MGD నీరు 28 వేల మందికి సరిపోతుందని, 100 MGD నీరు కేవలం తక్కువగా ఉండటం వల్ల నగరంలోని 28 లక్షల మందిని నీరు అందడం లేదని చెప్పారు.
బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ.. అతిషీ నిరాహార దీక్ష అంతా బూటకమని వర్ణించారు. వారి చేతకానితనాన్ని దాచడానికి ఇది రాజకీయ నాటకమని విమర్శించారు. అతిషీ ఒక పనికిరాని నీటి మంత్రి అని ఆరోపించారు. ఢిల్లీలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఫిబ్రవరి నుంచి అందరికి తెలుసు, కానీ ఆప్ ప్రభుత్వం ఎందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.