Amit Shah: జనన, మరణాలకు సంబంధించిన వివరాలను ఓటర్ల జాబితాతో పాటు మొత్తం అభివృద్ధి ప్రక్రియకు అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చేందుకు యోచిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం తెలిపారు. భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమీషనర్ కార్యాలయం ‘జనగణన భవన్’ని ప్రారంభించిన అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. జనాభా గణన అనేది అభివృద్ధి ఎజెండాకు ఆధారం అయ్యే ప్రక్రియ అని ఆయన అన్నారు.
ఖచ్చితమైన జనాబా గణాంక వివరాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జనాభా గణన సమాచారం ఆధారంగా ప్రణాళికలు రూపొందించడంతో పాటు పేదలకు అభివృద్ధి కార్యక్రమాలు చేరుతాయని ఆయన తెలిపారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రత్యే పద్దతిలో భద్రపరిస్తే అభివృద్ధి పనులను సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చని చెప్పారు. ఎన్నికల జాబితాతో జనన, మరణ వివరాలను లింక్ చేసే బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. దీని వల్ల ఒక వ్యక్తికి 18 ఏళ్లు నిండితే ఆటోమేటిక్ గా ఓటర్ల జాబితాలో చేర్చబడతాడని, మరణించినప్పుడు ఆటోమేటిక్ గా ఎన్నికల జాబితా నుంచి అతని పేరును తొలగించవచ్చని చెప్పారు.
Read Also: Samantha: లిప్ లాక్ లే కాదు.. వెబ్ సిరీస్లో అంతకు మించి ఉంటాయట
జనన మరణాల నమోదు చట్టం (RBD), 1969 సవరణ బిల్లు.. డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌ల జారీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందించడానికి సంబంధించిన విషయాలను కూడా సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు. ఇంతకుముందు తగిన డేటా లేక అభివృద్ధి విషయంలో అవరోధం ఏర్పడిందని అమిత్ షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ప్రతీ గ్రామానికి కరెంట్, ప్రతీ ఒక్కరికీ ఇల్లు, అందరికి కుళాయి తాగునీరు, ప్రతీ ఒక్కరికీ వైద్యం, ప్రతీ ఇంటికి మరుగుదొడ్లు ఇవ్వాలనే ప్రణాళికలు రూపొందించామని ఆయన చెప్పారు. జనాభా సేకరణ వివరాలను జియో ఫెన్సింగ్ తో కూడిన ఎస్ఆర్ఎస్ మొబైల్ యాప్ అప్ గ్రేడెడ్ వెర్షన్ ను ప్రారంభించారు. దీని ద్వారా ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్ కు వెళ్లి డేటాను రికార్డ్ చేస్తారని, బ్లాక్ లు సందర్శించకుండా ఎవరు నకిలీ వివరాలను ఎంట్రీ చేయడానికి కుదరదని అమిత్ షా వెల్లడించారు.