Uttar Pradesh: ముగ్గురు వ్యక్తులు తన భార్య, 14 ఏళ్ల కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లో ఈ ఘటన జరిగింది. సైఫ్నిలోని వారి ఇంటిలో నుంచి దొంగలు నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే వ్యక్తి చేసిన ఆరోపణలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా సదరు వ్యక్తి తన ఇంటి నుంచి రూ. 5000 నగదుతో పాటు మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత మళ్లీ కొద్ది సేపటికి వచ్చి తన భార్యతో పాటు కూతురుపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడినట్లు సోమవారం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Sarath Babu : నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు
ఈ ఘటనపై సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రిముగ్గురు వ్యక్తులు తన ఇంట్లోకి చొరబడి, తనను కట్టేసి, మొబైల్, రూ. 5000 తీసుకున్నాడని, తర్వాత తన భార్య, కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్లా మాట్లాడుతూ.. ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని, అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, తల్లీకూతుళ్లను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు వెల్లడించారు.
నిందితుల్లో ఒకరిని కైఫ్ గా గుర్తించారు. అతడిని విచారిస్తున్నామని, కొద్ది రోజుల క్రితం కైఫ్ కు ఫిర్యాదుదారుడితో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ ఘటన రాష్ట్రాన్ని భయాందోళనకు గురిచేసిందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని, ఇది అధికార బీజేపీ వైఫల్యమే అని ఆయన ట్వీట్ చేశారు.