Monsoon session: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని ఆయన ఆదివారం అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు.
Read Also: Ind W vs Eng W 2nd ODI: భారత్ 143 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 116 రన్స్ చేసింది.. అయినా గెలిచింది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ వాదనలను ప్రతిపక్షాలు లెవనెత్తతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అన్ని ప్రశ్నలకు పార్లమెంట్‌లో సమాధానం ఇస్తుందని, పార్లమెంట్‌లో కేంద్రం తగిన విధంగా స్పందిస్తుందని చెప్పారు. ముఖ్యమైన విషయాలు తలెత్తినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంట్‌లో ఎల్లప్పుడూ ఉంటారని అన్నారు.
వర్షాకాల సమావేశాల్లో 17 బిల్లులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,చర్చల సమయంలో అన్ని ప్రశ్నలకు ప్రతిస్పందిస్తుందని ఆయన అన్నారు. అఖిలపక్ష సమావేశంలో 51 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని, 54 మంది సభ్యులు హజరయ్యారని ఆయన పేర్కొన్నారు. వారి అభిప్రాయాలను పంచుకున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు వేర్వేరు సిద్ధాంతాలకు చెందిన కావచ్చు, కానీ పార్లమెంట్ సక్రంగా నడిచేలా చూసుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. డబ్బుతో దొరికిన జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించేందుకు 100 మందికిపైగా ఎంపీలు సంతకం చేశారని వెల్లడించారు. దీనిని ప్రవేశపెట్టడానికి గడువు ఇంకా నిర్ణయించాల్సి ఉందని వెల్లడించారు.