ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని నిబంధనలను ప్రకటించింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ను తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిన్నారులకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానాతో పాటు మూడు నెలల జైలుశిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడతాయని హెచ్చరికలు జారీ చేసింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ నిబంధనలు- 1989కి సవరణ ద్వారా కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు నాలుగేళ్ల పిల్లల నుంచి వర్తించనున్నాయి. కొత్త నిబంధనల్లో భాగంగా పిల్లలతో సహా ప్రయాణిస్తున్న ఏదైనా ద్విచక్ర వాహనం గంటకు గరిష్టంగా 40 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించకూడదు.