Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మరో వివాదంలో ఇరుక్కున్నారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) చీఫ్ రేఖా శర్మపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. మహిళా కమిషన్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) యూనిట్ రేఖా శర్మపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు సంబంధించి ఎక్స్ హ్యాండిల్ నుంచి వివరాలను తీసుకుంటుంది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
Read Also: BMW Car Accident: బీఎండబ్ల్యూ కార్ ఢీకొని మహిళ మృతి.. శివసేన నేత కుమారుడే ప్రధాన నిందితుడు..
గురువారం, హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని రేఖా శర్మ సందర్శించారు. ఆమెకు సంబంధించిన వీడియోలో ఒక వ్యక్తి వెనక గొడుగు పట్టుకుని కనిపిస్తారు. రేఖా శర్మ తన సొంత గొడుగు ఎందుకు పట్టుకోవడం లేదని ఒక యూజర్ ప్రశ్నించిన నేపథ్యంలో, మహువా మోయిత్రా స్పందిస్తూ.. ‘‘ఆమె(రేఖా శర్మ) తన బాస్ పైజామా పట్టుకోవడంలో చాలా బిజీగా ఉంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
ఈ కేసుపై మహువా మోయిత్రా మాట్లాడుతూ.. తాను పశ్చిమ బెంగాల్ నదియాలో ఉన్నానని, రాబోయే మూడు రోజులు ఇక్కడే ఉంటానని, కావాలంటే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. తాను తన సొంత గొడుగు పట్టుకోగలనని అన్నారు. వెస్ట్ బెంగాల్ కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. గతేడాది ఆమె ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసులో ఎంపీ పదవిని కోల్పోయారు. పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.